లంకతో జరుగుతున్న డే/నైట్ టెస్టులో టీమిండియా తడబడుతోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (4) ఆరంభంలోనే రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కుదురుకంటున్నట్లు కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ (15).. ఎంబుల్డెనియా బౌలింగ్‌లో వెనుతిరిగాడు. ఆ తర్వాత విహారి (31), కోహ్లీ జతకట్టారు.
వీళ్లిద్దరూ సంయమనంతో ఆడటంతో మొదటి టెస్టులోలాగానే జట్టును ఆదుకుంటారని అనిపించింది. కానీ ఇద్దరూ కలిసి 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కాసేపటికే విహారి అవుటయ్యాడు. 27వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన జయవిక్రమ తొలి బంతిని స్ట్రెయిట్‌గా వేశాడు ఆ తర్వాతి బంతినే టర్న్ చేశాడు. దీన్ని ఊహించని విహారి డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ డిక్కవెల్ల తడబడినా కూడా అందుకున్నాడు. దీంతో విహారి నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్.. ఆరంభం నుంచే భారీ షాట్లు ఆడుతున్నాడు.
ఆ తర్వాత కాసేపటికే కోహ్లీ (23) కూడా మరోసారి నిరాశపరిచాడు. డిసిల్వ వేసిన షార్ట్‌పిచ్ బంతిని ఆడేందుకు బ్యాక్ ఫుట్ తీసుకున్న కోహ్లీ.. బంతి చాలా తక్కువ ఎత్తులో రావడంతో ఆశ్చర్యపోయాడు. అప్పటికీ దాన్ని లెగ్ సైడ్ పంపేందుకు ప్రయత్నించాడు. కానీ కుదలేదు. దీంతో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.