భారత జట్టు సారధిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. వరుస టీ20 సిరీసుల్లో విజయాలు నమోదు చేశాడు. న్యూజిల్యాండ్, వెస్టిండీస్‌తో సిరీస్ విజయాల తర్వాత.. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో కూడా ఘనవిజయం సాధించింది టీమిండియా. శనివారం నాడు ధర్మశాలలో జరిగే రెండో టీ20లో విజయం సాధిస్తే రోహిత్ పేరిట ఒక అరుదైన రికార్డు చేరనుంది.
ప్రస్తుతం రోహిత్ సారధిగా 16 మ్యాచుల్లో 15 విజయాలతో ఉన్నాడు. ఈ క్రమంలో స్వదేశంలో అత్యధిక విజయాలు టీ20 సారధిగా ఇంగ్లండ్ సారధి ఇయాన్ మోర్గాన్, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో సమానంగా ఉన్నాడు. అయితే శ్రీలంకతో జరిగే రెండో టీ20 గెలిస్తే వీరిద్దరినీ అధిగమించి, స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన టీ20 సారధిగా ప్రపంచ రికార్డు లిఖిస్తాడు మన హిట్‌మ్యాన్. భారతీయ కెప్టెన్లలో చూసుకుంటే స్వదేశంలో ఎంఎస్ ధోనీ కంటే ఐదు, విరాట్ కోహ్లీ కంటే రెండు టీ20 విజయాలు రోహిత్ ఖాతాలో ఉన్నాయి.
ఓవరాల్‌గా చూస్తే.. రోహిత్ శర్మ టీ20 కెప్టెన్‌గా ఆడిన 24 మ్యాచుల్లో 22 విజయాలు సాధించాడు. శ్రీలంకతో రెండో టీ20లో విజయం సాధిస్తే టీమిండియా వరుసగా 11 విజయాలు సాధించినట్లవుతుంది. అలాగే, రోహిత్ ఖాతాలో వరుసగా మూడో టీ20 సిరీస్ విజయం చేరుతుంది. అంతేకాదు, అత్యంత వేగంగా 1000 టీ20 పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో కూడా రోహిత్ చేరతాడు. లంకతో తొలి టీ20లోనే ఈ ఫీట్ సాధించి ఉంటే.. పాక్ సారధి బాబర్ ఆజమ్‌తో కలిసి తొలి స్థానంలో నిలిచేవాడు.
ఆ మ్యాచ్‌లో 44 పరుగులకు అవుటైన రోహిత్.. ఈ ఫీట్ సాధించడానికి 19 పరుగుల దూరంలో నిలిచాడు. రెండో టీ20లో ఈ పరుగులు సాధిస్తే బాబర్ తర్వాత అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన టీ20 సారధిగా రికార్డు సృష్టిస్తాడు. బాబర్ ఆజమ్ 26 ఇన్నింగ్సుల్లో ఈ ఫీట్ సాధించగా.. లంకతో జరిగిన తొలి టీ20 రోహిత్‌కు 26వ ఇన్నింగ్స్. భారత మాజీ సారధి విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించడానికి 30 ఇన్నింగ్సులు తీసుకున్నాడు. ఎంఎస్ ధోనీకి ఈ మైలురాయి చేరుకోవడానికి అందరికన్నా ఎక్కువగా 57 ఇన్నింగ్సులు పట్టింది.