అనూహ్యంగా టర్న్, బౌన్స్ అవుతున్న బెంగళూరు పిచ్‌పై భారత జట్టు పోరాడే స్కోరు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (92) వీరోచిత పోరాటంతో 252 పరుగులు చేసిన భారత్.. లంకపై ఒత్తిడి పెంచింది. బౌలింగ్‌లో కూడా భారత జట్టు అదే తరహా ఒత్తిడి కంటిన్యూ చేస్తోంది. లంకేయులు బ్యాటింగ్‌కు దిగిన మూడో ఓవర్ తొలి బంతికే పేసర్ జస్ప్రీత్ బుమ్రా వికెట్ తీశాడు.
బుమ్రా వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని డ్రైవ్ చేసేందుకు మెండిస్ ప్రయత్నించాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడిన ఆ బంతి అతనికి దూరంగా వెళ్లడంతో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుంది. మూడో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్ చక్కని లో క్యాచ్ అందుకొని మెండిస్‌ను వెనక్కు పంపాడు. మూడో ఓవర్లోనే వికెట్ మెండిస్ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన తిరిమానే.. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు కొట్టి సత్తా చాటాడు.
ఆ తర్వాత మళ్లీ ఐదో ఓవర్లో బంతి అందుకున్న బుమ్రా.. తొలి బంతికే తిరిమానేను అవుట్ చేశాడు. ఆఫ్ స్టంప్ ఆవలగా వెళ్తున్న లెంగ్త్బాల్ను తిరిమానే కదిలించుకున్నాడు. దీంతో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్‌లో ఉన్న అయ్యర్ వైపు వెళ్లింది. దాన్ని నీట్‌గా రిసీవ్ చేసుకోలేకపోయినా కూడా కింద పడకుండా జాగ్రత్త పడ్డ అయ్యర్ క్యాచ్ పూర్తి చేశాడు. దీంతో తిరిమానే కూడా పెవిలియన్ చేరుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఆరో ఓవర్లో బంతి అందుకున్న మహమ్మద్ షమీ కూడా అదిరిపోయే డెలివరీతో తొలి బంతికే కరుణరత్నే (4)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా, షమీ బౌలింగ్ చూసిన అభిమానులు.. ఈ పిచ్ స్పిన్నర్లుకు అనుకూలిస్తుందా? లేక పేసర్లకా? అనే సందేహంలో పడిపోయారంటే పొరపాటేం లేదు. వీరి ధాటికి శ్రీలంక జట్టు ఆరు ఓవర్లు ముగిసే సరికి 16/3 స్కోరుతో నిలిచింది.