శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అవుటైన తీరు క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని కన్నా ఎక్కువగా లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్కవెల్ల చేసిన పని చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పేసర్ విశ్వ ఫెర్నాండో వేసిన బంతిని మయాంక్ అంచా వేయలేకపోయాడు.
దాంతో అతని ప్యాడ్లను తాకిన బంతి పాయింట్ దిశగా వెళ్లింది. లంక జట్టు ఎల్బీడబ్యూకు అప్పీలు చేసింది. అంపైర్ నుంచి స్పందర రాలేదు. అదే సమయంలో మయాంక్ అగర్వాల్ సింగిల్ కోసం క్రీజు వదిలాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ స్పందించలేదు. ఎందుకంటే ఫీల్డర్ జయవిక్రమ అప్పటికే బంతి అందుకున్నాడు.
మయాంక్ క్రీజు దాటడం చూసిన అతను వెంటనే బంతికి కీపర్ డిక్కవెల్లకు అందించాడు. సులభంగా రనౌట్ చేసే అవకాశం ఉన్నా కూడా ముందు రివ్యూ కోరిన డిక్కవెల్ల.. ఆ తర్వాతనే వికెట్లను పడగొట్టాడు. తీరా చూస్తే విశ్వ ఫెర్నాండో నోబాల్ వేసినట్లు తేలింది. దీంతో ఎల్బీ అయినా కూడా లెక్కలోకి రాదు. కానీ నిబంధనల ప్రకారం నోబాల్‌లో కూడా రనౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కారణంగా మయాంక్ పెవిలియన్ బాట పట్టాడు.
డిక్కవెల్ల చేసిన పనిపై కామెంటేటర్‌గా ఉన్న సునీల్ గవాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘‘అతను ఎందుకలా చేశాడో నాకు అసలు అర్థం కావడం లేదు’’ అని అన్నాడు. అదే సమయంలో లంక ఫీల్డింగ్ సెటప్ వల్లే రోహిత్, మయాంక్ మధ్య కన్ఫ్యూజన్ తలెత్తిందని, స్ట్రైకింగ్‌లో ఉన్న మయాంక్ పాయింట్లో ఉన్న ఫీల్డర్ ముందుకు రావడం చూడలేదని హర్షభోగ్లే వివరించాడు. ఏదేమైనా డిక్కవెల్ల రివ్యూ ఎందుకు కోరాడో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు.