ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ వైరం ఎవరిది? అని అడిగితే చిన్న పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరూ భారత్-పాక్ అనే చెప్తారు. మరి అంతటి వైరం ఉండే ఈ జట్టు సభ్యులు మ్యాచ్ ముందు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? అని అందరికీ ఆసక్తి ఉంటుంది. దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నోరువిప్పాడు. తను, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కలిసిన ప్రతిసారీ ఒకే తరహా విషయాలు మాట్లాడుకుంటామని చెప్పాడు.
‘ఇంటి దగ్గర ఎలా ఉంది?’ వంటి ప్రశ్నలు వేసుకుంటామని చెప్పిన రోహిత్.. ‘ఇల్లు, కుటుంబం ఎలా ఉంది? కొత్త కారు కొన్నావట కదా. ఇలా సాధారణ విషయాలే మా మధ్య చర్చకు వస్తాయి’ అని వెల్లడించాడు. తమకు ముందు తరం ఆటగాళ్లు కూడా ఇలాంటి మాటలే మాట్లాడుకునే వారని, ఈ విషయాన్ని వాళ్లే చాలాసార్లు చెప్పారని రోహిత్ అన్నాడు. కుటుంబాలు, ఏ కారు కొన్నావ్? లేదంటే ఏ కారు కొనాలని అనుకుంటున్నావ్? ఇలాంటి విషయాలే వాళ్లు కూడా మాట్లాడుకునే వారని వివరించాడు.