Ind Vs Pak | ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌ను భారత్ చిత్తు చేసింది. ఐదు వికెట్ల తేడాతో దాయాది దేశాన్ని ఓడించి విజయం సాధించింది. గెలుపు అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ, మెడల్స్ తీసుకునేందుకు భారత ప్లేయర్స్ నిరాకరించారు. ట్రోఫీ లేకుండానే విజయోత్సవాలను జరుపుకున్నారు టీమిండియా ప్లేయర్స్. కార్యక్రమం అనంతరం పీసీబీ చైర్మన్ ట్రోఫీని తీసుకొని హోటల్‌కు వెళ్లిపోయారు. వాస్తవానికి ఏసీసీ అధికారులు జోక్యం చేసుకొని ప్రయత్నించారు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఖలీద్ అల్ జరూనితో అవార్డులను ప్రదానం చేయాలని సూచించారు. కానీ, దానికి నఖ్వీ నిరాకరించారు. దాదాపు గంట సేపటి తర్వాత నిర్వాహకులు తిలక్ వర్మ, అభిషేక్ శర్మలకు వ్యక్తిగత ప్రదర్శనకు అవార్డులను ప్రదానం చేశారు.
మ్యాచ్ సమయంలో స్టాండ్లలో కూర్చున్న ప్రేక్షకులు, భారత అభిమానులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రేక్షకులు భారత్ మాతా కీ జై, మోడీ-మోడీ అంటూ నినదించారు. మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ జట్టు చాలా సేపు డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉండిపోయింది. దాంతో చాలాసేపు ణక్వీ ఒంటరిగా ఉండిపోయారు. ఈ సమయంలో అసౌకర్యంగా కనిపించారు. దాంతో ఆయన పీసీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారా? ఏసీసీకి చైర్మన్‌గా ఉన్నారా? తెలియలేదు. ఇక భారత జట్టు సాధించిన విజయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత జట్టును అభినందించారు. ‘మైదానంలోనూ ఆపరేషన్ సిందూర్. ఇక్కడ కూడా ఫలితం అదే. భారత్ గెలిచింది. ఇందుకు మన క్రికెటర్లకు అభినందనలు’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. అయితే, దీనిపై పీసీబీ చైర్మన్ నఖ్వీ ఓ ట్వీట్ చేశారు. మోదీ ప్రకటన తప్పన్నారు. ‘యుద్ధం గర్వానికి కొలమానమైతే.. చరిత్ర ఇప్పటికే పాకిస్తాన్ చేతిలో మీ అవమానకరమైన ఓటమిని నమోదు చేసింది. ఏ క్రికెట్ మ్యాచ్ కూడా ఈ సత్యాన్ని మార్చలేదు. యుద్ధాన్ని క్రీడల్లోకి లాగడం నిరాశను మాత్రమే చూపుతుంది. క్రీడాస్ఫూర్తికి అవమానం’ అంటూ ట్వీట్ చేశారు.
అయితే, ఆయన ట్వీట్‌పై భారతీయులు మండిపడుతున్నారు. నఖ్వీ ఆటను రాజకీయ సమస్యగా మార్చి చాంపియన్లను అవమానించారని మండిపడ్డారు. నఖ్వీ ఏ యుద్ధాన్ని ప్రస్తావిస్తున్నాడని అభిమానులు నిలదీశారు. అది 1965 యుద్ధం అయినా, 1971 యుద్ధం అయినా, 1999లో కార్గిల్ యుద్ధమైనా భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయాలను చవిచూసిందని.. దుష్ట కుట్రలను తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. ఇటీవల భారత్‌పై చేసిన డ్రోన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుందని గుర్తు చేశారు. డ్రోన్లు, మిస్సైల్స్‌ను సైతం కూల్చివేసిందని, ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని.. వందమందికిపైగా ఉగ్రవాదులను మట్టుమెట్టిందని గుర్తు చేస్తున్నారు. ఈ యుద్ధాలలో దేని గురించి నఖ్వీ గురించి తాను ప్రస్తావిస్తున్నాడో తెలియదని.. బహుశా ఆయన మాత్రమే స్పష్టంగా చెప్పగలడని సెటైర్లు వేస్తున్నారు.
Tweet