IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడుతున్నది. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. టీమిండియా 242 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తొలి బంతిని కెప్టెన్ రోహిత్ శర్మ ఎదుర్కోగా.. పాకిస్తాన్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌కు వచ్చాడు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 241 పరుగులకే కుప్పకూలింది. వన్డేల్లో వరుసగా ఐదో మ్యాచ్‌లో భారత్ ప్రత్యర్థి జట్టును 50 ఓవర్లలోపే ఆలౌట్ చేసింది.
హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ్యాటర్ ఖుష్దిల్ షా కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఖుష్దిల్ 39 బంతుల్లో రెండు సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. కుల్దీప్ భారత్ తరఫున అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్ తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. ఈ జోడిని హార్దిక్ పాండ్యా విడగొట్టాడు. పాండ్యా బౌలింగ్‌లో బాబర్ వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 26 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 23 పరుగులు చేసి బాబర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇమామ్ ఉల్ హక్ రన్ అవుట్ అయ్యాడు. 26 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేశాడు. 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను సౌద్ షకీల్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
ఇద్దరూ మూడో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. షకీల్ తన వన్డే కెరీర్లో నాల్గో అర్ధ సెంచరీ సాధించాడు. ఈ భాగస్వామ్యాన్ని అక్షర్ పటేల్ బ్రేక్ చేశాడు. రిజ్వాన్‌ను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 77 బంతుల్లో మూడు ఫోర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత పాకిస్తాన్ వరుస వికెట్లు కోల్పోయింది. కొద్దిసేపటికే షకీల్ 76 బంతుల్లో ఐదు ఫోర్లతో 62 పరుగులు చేసిన హార్దిక్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. తైబ్ తాహిర్ (4), సల్మాన్ అలీ ఆఘా (19) పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత షాహిద్ ఆఫ్రిది డకౌట్ కాగా.. నషీమ్ షా 14, హరీస్ రవుఫ్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కుల్దీప్ మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యాకు మూడు, హర్షిత్ రాణా, అక్షర్, జడేజా తలో వికెట్ దక్కింది.