ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ గుర్తింపు తెచ్చుకొని, టీమిండియా తలుపులు తట్టిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్. అయితే అతని కెరీర్‌కు గాయాలు అడ్డంకులుగా మారాయి. ఫామ్‌లో ఉంటే కచ్చితంగా టీ20 ప్రపంచకప్ ఆడతాడని అనుకుంటున్న అతను.. గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో క్వాడ్రెసెప్స్ గాయంతో అతను క్రికెట్‌కు దూరమయ్యాడు. అప్పటి నుంచి రికవరీలోనే ఉన్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్, సౌతాఫ్రికా టూర్, ఐర్లాండ్ టూర్లకు కూడా అందుబాటులో లేడు. ఆ తర్వాత జరిగే ఇంగ్లండ్ పర్యటనలో కూడా తను ఆడలేనని చాహర్ తాజాగా వెల్లడించాడు.
గాయం నుంచి త్వరగానే కోలుకుంటున్నానని, కానీ కనీసం మరో 4-5 వారాల తర్వాతే మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తానని చాహర్ వెల్లడించాడు. ప్రస్తుతం రీహాబిలిటేషన్‌లో భాగంగా.. ఏకధాటిగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తున్నానని, గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నానని చెప్పాడు.
దాంతో ఇంగ్లండ్ పర్యటనకు కూడా అతను అందుబాటులో ఉండడని తేలిపోయింది. ఈ విషయాన్ని దీపక్ చాహర్ స్వయంగా వెల్లడించినట్లు సమాచారం.