IND vs ENG | భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో లార్డ్స్ టెస్టులో ఆతిథ్య జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ 1-2 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓటమికి కారణాలు తెలిపాడు. చివరి రోజు విజయంపై తనకు నమ్మకం ఉందని.. అయితే, విజయానికి పెద్ద భాగస్వామ్యం నెలకొల్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. గిల్ జట్టు ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశాడు. ప్రదర్శన చూస్తే చాలా గర్వగా ఉందని చెప్పుకొచ్చాడు. ‘మ్యాచ్‌లో విజయం సాధిస్తామని చాలా నమ్మకంగా ఉన్నాం. ఎందుకంటే ఎందుకంటే కీలకమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. టాప్ ఆర్డర్లో కొన్ని మంచి భాగస్వామ్యాలు అవసరం. కానీ, మేం అలా చేయలేకపోయాం. మా కంటే ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. లక్ష్యం పెద్దదేమీ కాదు. మ్యాచ్‌లో భాగస్వామ్యం కీలకం. రవీంద్ర జడేజా చాలా సీనియర్ ప్లేయర్. అతనికి ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అతను టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్ ఆడుతూనే ఉండాలని కోరుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
లార్డ్స్ టెస్టులో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 82 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. కానీ, రవీంద్ర జడేజా 181 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఎనిమిదో వికెట్‌కు నితీశ్ రెడ్డి (13)తో కలిసి 91 బంతుల్లో 30 పరుగులు, జస్ప్రీత్ బుమ్రా (05)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 132 బంతుల్లో 35 పరుగులు, సిరాజ్‌తో కలిసి చివరి వికెట్‌కు 80 బంతుల్లో 23 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు విజయంపై ఆశలు రేకెత్తించాడు. కానీ, ఓ వైపు ఒంటరి పోరాటం చేసినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు.
వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మాంచెస్టర్ టెస్టులో ఆడుతాడని గిల్ తెలిపాడు. స్కాన్‌లో పంత్ వేలికి ఎలాంటి పెద్ద గాయం కాలేదని తేలిందని.. నాలుగో టెస్ట్ వరకు ఫిట్‌గా ఉంటాయని పేర్కొన్నారు. మూడో టెస్ట్ తొలి రోజు రెండవ సెషన్లో పంత్ ఎడమ చూపుడు వేలుకు గాయం కావడంతో మైదానం విడిచి వెళ్లాల్సి వచ్చింది. గిల్ మాట్లాడుతూ పంత్ స్కానింగ్ కోసం వెళ్లాడు. అతనికి పెద్దగా గాయం కాలేదు. కాబట్టి మాంచెస్టర్ మ్యాచ్ వరకు సిద్ధమవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. నాలుగో టెస్ట్‌కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా? అని ప్రశ్నించగా.. సమాధానం ఇవ్వలేదు. త్వరలోనే ఈ విషయం గురించి తెలుసుకుంటారు’ అని గిల్ తెలిపాడు.