Sourav Ganguly | ఇంగ్లాండ్ పర్యటనకు శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయ్యర్ ఇటీవల మెరుగ్గా రాణిస్తున్నాడని.. తనికి అవకాశం ఇవ్వాల్సిందన్నారు. ఈ నెల 20 నుంచి ఇంగ్లాండ్-భారత్ మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం ఇప్పటికే భారత జట్టు ఇంగ్లాండ్‌కు చేరుకుంది. ప్రాక్టీస్ సైతం షురూ చేసింది. అయితే, టెస్టు జట్టులోకి అయ్యర్‌ను గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంట్వర్యూలో మాట్లాడుతూ.. ఏడాది కాలంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడని.. అతను జట్టులో ఉండి ఉండాల్సిందని పేర్కొన్నారు చాలాకాలం జట్టుకు దూరంగా ఉన్న ఆటగాడని.. ఇప్పుడు ఒత్తిడిలోనూ పరుగులు సాధిస్తున్నాడని, బాధ్యత తీసుకుంటున్నాడని గుర్తు చేశాడు. షార్ట్ బాల్స్ బాగా ఆడుతున్నాడని.. టెస్ట్ క్రికెట్ భిన్నంగా ఉన్నప్పటికీ సిరీస్‌లో అతన్ని జట్టులో చేర్చాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు మాజీ కెప్టెన్.
ఇంగ్లాండ్ పర్యటన కోసం 18 మంది సభ్యులతో జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఇప్పటి వరకు అయ్యర్ భారత్ తరఫున 14 టెస్టులు ఆడాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీల సహాయంతో 811 పరుగులు చేశాడు. గత సంవత్సరం ఇంగ్లాండ్‌తో జరిగిన ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చిన సమయంలో చివరి టెస్ట్ ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 2024-25 రంజీ సీజన్లో అద్భుతంగా రాణించాడు. ముంబయి తరఫున ఏడు ఇన్నింగ్స్‌లలో 68.57 సగటుతో 480 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఈ సీజన్లో బరిలోకి దిగిన శ్రేయాస్ అయ్యర్.. ఆ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లగలిగాడు. ఆర్సీబీతో జరిగిన ఫైనల్లో ఆరు పరుగుల తేడాతో ఓడి రన్నర్‌గా నిలిచింది. ఐపీఎల్లో అయ్యర్ బ్యాట్‌తోనూ రాణించాడు. 17 మ్యాచుల్లో 604 పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలున్నాయి.
ఈ సందర్భంగా ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఫామ్‌పై మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌పై బుమ్రా బౌలింగ్ కీలకం కానుందని చెప్పాడు. ఇంగ్లాండ్‌పై రెండు విషయాలు కీలకమని.. మంచి బ్యాటింగ్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉండడమేనని చెప్పాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని యువ బ్యాటింగ్ లైనప్‌తో మెల్బోర్న్లో (2020-21) ఆస్ట్రేలియాలో గెలిచామని.. కాబట్టి ఈ సారి ఎందుకు గెలవలేదో తనకు అర్థం కావడం లేదన్నారు. ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ జూన్ 20 నుంచి లీడ్స్‌లో మొదలు కానున్నది. రెండవ టెస్ట్ జూలై 2 నుంచి బర్మింగ్ హామ్లో జరుగుతుంది. మూడవ టెస్ట్ జూలై 10 నుండి లార్డ్స్.. నాల్గవ టెస్ట్ జూలై 23 నుంచి మాంచెస్టర్‌లో జరుగనున్నాయి. ఐదవ టెస్ట్ జూలై 31 నుంచి లండన్ లోని ఓవల్ మైదానంలో జరుగనున్నది. భారత జట్టు కొత్త ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ సైకిల్ (2025-27)లో శుభారంభం చేయాలని భావిస్తున్నది.