IND Vs ENG Test | ఇంగ్లండ్ వేదికగా లార్డ్స్ మైదానంలో ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. 22 పరుగుల తేడాతో భారత్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది. టీమిండియా తరఫున ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేసిన ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఈ మ్యాచ్‌లో విజయంతో ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి ఉన్నది. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని జట్టు లీడ్స్ టెస్ట్‌లో భారత్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. శుభ్‌మన్ నేతృత్వంలోని భారత జట్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 336 పరుగుల తేడాతో గెలుచుకుంది.
లార్డ్స్ టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో పది వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. జోరూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడాన్ కార్స్ (21) పరుగులు చేశారు. టీమిండియా సైతం తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కేఎల్ రాహుల్ (100), రిషబ్ పంత్ (74), రవీంద్ర జడేజా (72) పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 192 పరుగులకు కుప్పకూలింది. టీమిండియాకు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు కేవలం 170 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. రవీంద్ర జడేజా (61నాటౌట్), కేఎల్ రాహుల్ (39) మినహా ఎవరూ రాణించలేదు.
జడేజా బుమ్రా, సిరాజ్‌తో కలిసి టీమిండియాను గెలిపించేందుకు కష్టపడ్డా అతని శ్రమ అంతా వృథా అయ్యింది. 74.5 ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో సిరాజ్ అవుట్ అవడంతో టీమిండియా పోరాటం ముగిసింది. షోయబ్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి బ్యాట్‌పై నుంచి క్రీజులో పడి స్టంప్స్‌ను తాకింది. బంతి వికెట్లను తాకడంతో సిరాజ్ సైతం షాక్‌కు గురయ్యాడు. దాంతో ఇంగ్లండ్ ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోగా.. టీమిండియా ప్లేయర్స్ అంతా షాక్ అయ్యారు. ఇక ఇంగ్లండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ ఈ నెల 23-27 మధ్య మాంచెస్టర్‌లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగనున్నది.