ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఒక భారత పేసర్ 23 వికెట్లు తీయడం ఇది రెండోసారి. 021/22లో బుమ్రా (23) ఈ రికార్డు సాధించాడు.
అద్భుత విజయం. సిరాజ్‌కు ప్రత్యేక అభినందనలు. అతడు, ప్రసిద్ధ్ కలిసి దేశానికి అద్భుతమైన విజయాన్ని అందించారు. జట్టు కోసం ఆడేప్పుడు సిరాజ్ వంద శాతం శ్రమిస్తాడు. అతడిపట్ల చాలా సంతోషంగా ఉంది’
– విరాట్ కోహ్లీ
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం ; గత నెల 14న లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు ఆఖరి రోజు ఆట ఆడుతున్నాయి. జడేజా అసాధారణ పోరాటంతో జట్టును గెలుపుదిశగా నడిపించాడు. మరో ఎండ్‌లో సిరాజ్ కూడా తనవంతు పాత్రను విజయవంతంగా నిర్వర్తించాడు. కానీ దురదృష్టవశాత్తూ భారత విజయానికి 22 పరుగుల దూరంలో బషీర్ బౌలింగ్‌లో సిరాజ్ బంతిని డిఫెండ్ చేసినా అది కాస్తా వికెట్లను తాకడంతో భారత్ ఓటమి వైపు నిలిచింది. ఆ సమయంలో ఈ హైదరాబాదీ కన్నీటిపర్యంతమయ్యాడు. కట్‌చేస్తే.. సరిగ్గా మూడు వారాల తర్వాత సిరీస్‌ను సమం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదే సిరాజ్ బంతితో అద్భుతమే చేశాడు. ఆఖరి రోజు ఇంగ్లండ్ గెలుపునకు 35 పరుగులు అవసరమవగా ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లుతూ మూడు వికెట్లు (రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం 5) పడగొట్టి ఓవల్‌లో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. లార్డ్స్ ఓటమి బాధను ఓవల్‌లో విజయంతో అధిగమించాడు.
బుమ్రా లేకుంటే ప్రత్యర్థులకు చుక్కలే..
సుమారు దశాబ్దకాలంగా భారత పేస్ బౌలింగ్‌కు బుమ్రా ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. స్వదేశీ, విదేశీ పర్యటనల్లో అతడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. బుమ్రా నీడలో సిరాజ్‌కు రావాల్సిన గుర్తింపు రాలేదనేది సగటు భారత క్రికెట్ అభిమాని ఆవేదన. కానీ బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ చెలరేగే తీరు మాత్రం చూసి తీరాల్సిందే. ముఖ్యంగా ‘సేనా’ (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆసీస్) దేశాల్లో సిరాజ్‌ను అడ్డుకోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు శక్తికి మించిన పనే. ఆడేది ఆస్ట్రేలియాకు పట్టున్న మెల్బోర్న్, సిడ్నీ, పెర్త్ అయినా సఫారీల కంచుకోట కేప్‌టౌన్ అయినా.. క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ అయినా సిరాజ్ దూకుడుకు దాసోహమవ్వాల్సిందే. మియా భాయ్ ఇప్పటిదాకా 41 టెస్టులాడగా అందులో బుమ్రాతో కలిసి ఆడినవి 23. ఈ క్రమంలో అతడి సగటు 33.82గా ఉంది. బుమ్రా లేకుంటే 16 టెస్టులాడిన ఈ డీఎస్పీ సగటు 25.59గా నమోదైంది. బుమ్రాతో ఆడిన మ్యాచ్‌లలో 74 వికెట్లు పడగొడ్తే అతడు లేకుండా 16 టెస్టుల్లోనే 49 వికెట్లు తీసి తానెంటో ప్రపంచానికి చాటి చెప్పాడు.
185.3 ఓవర్లు.. 23 వికెట్లు
వర్క్‌లోడ్ కారణంగా ఈ సిరీస్‌లో బుమ్రా ఆడినవి 3 మ్యాచ్‌లే కాగా కీలక మ్యాచ్ (బర్మింగ్‌హామ్, ఓవల్)లలో భారత పేస్ దళం బాధ్యతలను సిరాజ్ మోశాడు. ఆకాశ్, ప్రసిద్ధ్‌కు ఈ పర్యటన కొత్త కాగా.. వారిని వెన్ను తట్టి నడిపిస్తూ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టడంలో సిరాజ్ సఫలమయ్యాడు. బుమ్రా ఫిట్నెస్తో పోలిస్తే అతడికంటే సిరాజ్ ఎన్నో రెట్లు ముందుటాడు. పలుమార్లు ప్రదర్శన బాగాలేక జట్టు నుంచి తప్పించారే తప్ప మ్యాచ్ ఫిట్నెస్ లేదని సిరాజ్ బెంచ్‌పై కూర్చున్న సందర్భాలైతే ఇప్పటిదాకా లేవంటే అతిశయోక్తి కాదు. ఈ సిరీస్‌లో ఒక్కోసారి సిరాజ్ ఏకంగా ఏకబిగిన 8, 9 ఓవర్ల పాటు లాంగ్ స్పెల్స్ వేసిన సందర్భాలూ ఉన్నాయి. మూడు టెస్టుల్లో బుమ్రా 119.4 ఓవర్లు వేయగా సిరాజ్ 185.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. వోక్స్ (ఇంగ్లండ్) 181 ఓవర్లు వేసినా అతడు తీసింది 11 వికెట్లే. ఈ సిరీస్‌లో రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన సిరాజ్.. ఒకసారి 4 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల వీరుల్లో అగ్రస్థానాన నిలిచాడు.
దేశం కోసం ఎందాకైనా పోరాడతా
మ్యాచ్ ముగిశాక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాత్రికేయులు సిరాజ్‌ను తన ఫిట్‌నెస్‌పై వాకబు తీయగా అతడు స్పందిస్తూ.. ‘వాస్తవంగా చెప్పాలంటే నా శరీరం బాగానే ఉంది. ఈ సిరీస్‌లో సుమారు 187 ఓవర్లు బౌలింగ్ చేశా. కానీ దేశం తరఫున ఆడుతున్నప్పుడు దేని గురించీ ఆలోచించను. నా తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు శ్రమిస్తా. ఒక స్పెల్‌లో ఎన్ని ఓవర్లు వేశామన్నదాని గురించి నేను పట్టించుకోను. నేను వేసే ప్రతి బంతి దేశం కోసమే. నా వ్యక్తిగతానికి కాదు’ అని చెప్పాడు. సిరాజ్‌పై గిల్‌తో పాటు ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ కూడా ప్రశంసలు కురిపించారు.
– సిరాజ్