ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు అద్భుతంగా గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. బ్యాటర్లు రాణించడంతో 198/8 భారీ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లండ్ బ్యాటర్లను 148 పరుగులకే ఆలౌట్ చేసి తొలి టీ20లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆటగాడు మాత్రం హార్దిక్ పాండ్యానే.
బ్యాటింగ్‌లో అదరగొట్టిన అతను తన కెరీర్లో తొలి అర్థసెంచరీ సాధించాడు. అనంతరం బౌలింగ్‌లో కూడా సత్తా చాటి 4 వికెట్లతో రాణించాడు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన భారత మాజీ దిగ్గజం వసీం జాఫర్.. తొలి టీ20లో హార్దిక్ బాస్‌లా ప్రవర్తించాడని కితాబిచ్చాడు.
‘‘చాలా అందంగా బ్యాటింగ్ చేశాడతను. అలాగే బౌలింగ్‌లో కూడా ఎక్కడ వేస్తే బ్యాటర్లు ఆడలేరో సరిగ్గా ఆ లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి, ఇంగ్లండ్‌లోని అత్యుత్తమ బ్యాటర్లకు షాకిచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఒక బాస్‌లా ప్రవర్తించాడు’’ అని మెచ్చుకున్నాడు. అసలు బౌలింగ్ చేస్తే చాలు.. హార్దిక్‌కు టీమిండియాలో చోటు ఖాయం అని అందరూ అనేవారన్న విషయాన్ని కూడా జాఫర్ గుర్తుచేశాడు.
అలాంటిది అతను ఇంతటి ఫామ్‌లో ఉంటే కచ్చితంగా భారత జట్టులో కీలకంగా మారతాడని వివరించాడు. అంతర్జాతీయ టీ20లో హాఫ్ సెంచరీ సాధించడంతోపాటు నాలుగు వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా హార్దిక్ రికార్డు నెలకొల్పాడు.