ఆసియాకప్‌లో భారత్ బోణీ కొట్టింది. వర్షం కారణంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరు రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో నేపాల్‌పై జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు ఆటంకం కలిగించినా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించిన రోహిత్ సేన సూపర్-4కు అర్హత సాధించింది. బౌలింగ్‌లో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా విజృంభిస్తే.. బ్యాటింగ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ దంచికొట్టారు.
పల్లెకెలె: వరుణుడి దోబూచులాట మధ్య సాగిన పోరులో భారత్ విజయం సాధించింది. ఆసియాకప్ గ్రూప్-‘ఎ’లో భాగంగా సోమవారం జరిగిన పోరులో టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) నేపాల్‌ను చిత్తు చేసి సూపర్-4 దశకు చేరింది. మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అడ్డుపడగా.. సవరించిన లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్.. 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఆసిఫ్ (58), సోమ్‌పాల్ (48) రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, జడేజా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగగా.. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం డకవర్త్ పద్ధతిలో భారత విజయ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా నిర్ధారించారు. చేజింగ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ (59 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (62 బంతుల్లో 67; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకాలతో కదంతొక్కడంతో టీమ్ఇండియా 20.1 ఓవర్లలో సునాయాసంగా గెలుపొందింది. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గత మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ సారి బౌలర్లకు తగినంత ప్రాక్టీస్ లభించాలనే ఉద్దేశంతో బౌలింగ్ తీసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో బుమ్రా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో మహమ్మద్ షమీ జట్టులోకి రాగా.. టీమ్ఇండియాతో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న నేపాల్ తమ పోరాటంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓపెనర్లు కుషాల్ (39), ఆసిఫ్ చక్కటి ప్రతిభ చూపారు. మన ఫీల్డర్ల తప్పిదాలు కూడా వారికి సహకరించడంతో నేపాల్ తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించగలిగింది. గత మ్యాచ్‌లో ఇదే పిచ్‌పై పాకిస్థాన్ బౌలర్లు కొత్త బంతితో నిప్పులు చెరిగిన చోట.. మన వాళ్లు మాత్రం ప్రత్యర్థిని దెబ్బకొట్టలేకపోయారు. పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ జట్టుకు బ్రేక్ త్రూ అందించగా.. జడేజా చకచకా 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేశాడు. అయితే మిడిలార్డర్ పోరాటంతో నేపాల్ మంచి స్కోరే చేసింది.
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్, గిల్ దంచికొట్టారు. నేపాల్ బౌలర్ల అనుభవరాహిత్యాన్ని సొమ్ము చేసుకుంటూ పరుగుల వరద పారించారు. ఈ క్రమంలో మొదట హిట్‌మ్యాన్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. గిల్ 47 బంతుల్లో ఆ మార్క్ అందుకున్నాడు. ఈ ఇద్దరే మ్యాచ్‌ను ముగించారు.
నేపాల్: 48.2 ఓవర్లలో 230 (ఆసిఫ్ 58, సోమ్‌పాల్ 48; జడేజా 3/40, సిరాజ్ 3/61)
భారత్: 20.1 ఓవర్లలో 147/0 (రోహిత్ 74 నాటౌట్, గిల్ 67 నాటౌట్).
ఆసియాకప్‌లో భారత్ తొలి విజయం నమోదు చేసుకున్నా.. ఓవరాల్గానైతే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. గత మ్యాచ్‌లో పాక్ పేసర్ల ధాటికి టాపార్డర్ విఫలమైతే.. ఈ సారి బౌలర్లు ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వన్డే ప్రపంచకప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీకి సన్నద్ధమవుతున్న టీమ్ఇండియా నుంచి ఇలాంటి ఆటతీరు ఆహ్వానించదగ్గ విషయం కాదు! అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి భారత్‌తో ఆడుతున్న నేపాల్ బ్యాటర్లు.. మన బౌలర్లను అలవోకగా ఎదుర్కోవడం అభిమానులను సైతం ఆశ్చర్య పరిచింది. పెద్దగా అనుభవం లేని యువ ఆటగాళ్లు సైతం స్వచ్ఛగా షాట్లు ఆడటం మన బౌలింగ్ డొల్లతనాన్ని బయట పెడితే.. ఫీల్డర్లు ప్రత్యర్థికి ఇతోధిక సాయం చేశారు. తొలి ఐదు ఓవర్లలోనే మూడు క్యాచ్‌లు నేల పాలు చేసి నేపాల్ భారీ స్కోరు చేసేందుకు బా టలు వేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్ అనదగ్గ విరాట్ కోహ్లీ సులువైన క్యాచ్‌ను వదిలేయడం ఆశ్చర్యం కలిగించగా.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కూడా బంగారం లాంటి అవకాశాలను నేలపాలు చేశారు. మ్యాచ్ మొత్తం ఫీల్డింగ్‌లో తడబాటు కనిపించగా.. చివర్లో కోహ్లీ ఒంటి చేతి క్యాచ్‌తో అదుర్స్ అనిపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు అనుకూలమైంది ఏదైనా ఉందంటే.. అది ఓపెనర్లు లయ అందుకోవడమే. అనుభవం లేని నేపాల్ బౌలింగ్ దళాన్ని టీమ్ఇండియా ఓపెనర్లు అలవోకగా ఎదుర్కున్నారు.