న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్(T20 World Cup)లో భాగంగా ఈనెల 15వ తేదీన భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐసీసీ ప్రశ్నించింది. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయడం వల్ల పాకిస్థాన్ క్రికెట్ శిక్షార్హమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఐసీసీ తన హెచ్చరికల్లో పేర్కొన్నది. ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి ప్రారంభంకానున్న వరల్డ్ కప్‌లో ఆడేందుకు అనుమతి ఇస్తున్నామని, కానీ 15వ తేదీన మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ ప్రభుత్వం తన సోషల్ మీడియా పోస్టులో ఆదివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ స్పందించింది.
పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పునరాలోచిస్తుందని భావిస్తున్నట్లు ఐసీసీ చెప్పింది. పాక్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ దేశ క్రికెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని ఐసీసీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ వ్యవస్థ కూడా తీవ్ర ప్రభావానికి లోనవుతుందని ఐసీసీ తన హెచ్చరికల్లో వెల్లడించింది. ఐసీసీ ద్వారా లబ్ధి పొందుతున్న పాకిస్థాన్ జరగబోయే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఐసీసీ తెలిపింది. జాతీయ విధానంలో భాగంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను ఐసీసీ గౌరవిస్తుందని, కానీ క్రీడాస్పూర్తికి వ్యతిరేకంగా నిర్ణయాలను ఎంకరేజ్ చేయలేమని ఐసీసీ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్ని నిరాశపరచలేమన్నారు. పాకిస్థాన్‌లో కూడా లక్షలాది మంది క్రికెట్ అభిమానులు ఉన్నట్లు ఐసీసీ తెలిపింది.
ఇది ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం కాదు అని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా అన్నారు. ఇది క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయమని అన్నారు. దానికి మేం కట్టుబడి ఉంటామని పాక్ క్రికెటర్ తెలిపారు. మ్యాచ్ జరుగుతుందో లేదో ఇంకా తెలియదు. కానీ ఐసీసీ నియమావళి ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీన శ్రీలంకలో ఇండియా జట్టు ఉంటుందని భారత్ పేర్కొన్నది. షెడ్యూల్ ప్రకారం భారత జట్టు వెళ్తుందని, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటుందని, స్టేడియానికి అనుకున్న సమయానికి జట్టు చేరుకుంటుందని, మ్యాచ్ రిఫరీ అధికారికంగా మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించే వరకు భారత జట్టు అక్కడే ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.