Champions Trophy | వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పాక్ వేదికగా జరుగననున్నది. ఈ టోర్నీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఐసీసీ పాక్‌కు టీమ్‌ని పంపింది. అదే సమయంలో జనవరిలో జరుగనున్న ముక్కోణపు సిరీస్‌కు ముందు భద్రత, ఇతర ఏర్పాట్లను సమీక్షించేందుకు న్యూజిలాండ్ క్రికెట్ సైతం పాక్‌కు ఓ స్పెషల్ టీమ్‌ని పంపింది. పాకిస్తాన్‌తో పాటు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు ముక్కోణపు సిరీస్‌లో పాల్గొననున్నాయి. భద్రతా నిపుణుడు రెగ్ డికాసన్, న్యూజిలాండ్ ప్లేయర్స్ అసోసియేషన్ ప్రతినిధి బ్రాడ్ రోడెన్ న్యూజిలాండ్ జట్టులో ఉన్నారు. వారంతా కరాచీ, లాహోర్‌లో భద్రతా ఏర్పాట్లతో పాటు ఇతర సన్నాహకాలను సమీక్షించనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచులన్నీ తటస్థ వేదికల్లో జరుగుతాయని ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరిలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య హోదాలో పాక్‌తో పాటు యూఏఈలో భారత్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మేరకు ఐసీసీ, పీసీబీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. హైబ్రిడ్ మోడల్‌కు ఓకే చెప్పిన పీసీబీ.. 2024 నుంచి 2027 వరకు జరిగే టోర్నీల్లో తాము కూడా భారత్‌లో పర్యటించమంటూ స్పష్టం చేయడంతో తటస్థ వేదికలపై నిర్వహణకు బీసీసీఐ సైతం అంగీకరించింది. ఈ క్రమంలో సన్నాహాలను సమీక్షించేందుకు ఐసీసీ పాక్‌కు ఒక బృందాన్ని పంపింది. ఐసీసీ బృందం లాహోర్, రావల్పిండికి వెళ్లే ముందు కరాచీలోని నేషనల్ స్టేడియాన్ని సందర్శించింది. ఏదైనా పెద్ద టోర్నమెంట్‌కు ఐసీసీ బృందాలను పంపుతాయని ఓ పీసీబీ అధికారి పేర్కొన్నారు. ఐసీసీతో పాటు న్యూజిలాండ్ జట్టు కరాచీ, లాహోర్, రావల్పిండిలోని స్టేడియం మరమ్మతు, పునరుద్ధరణ పనులపై సమీక్షించాయి. అయితే, చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో స్టేడియాలను సిద్ధం చేసేందుకు పీసీబీ రూ.12 బిలియన్స్ని ఖర్చు చేస్తున్నది.