ICC : శ్రీలంక క్రికెట్ బోర్డుకు మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరగాల్సిన అండర్ -19 వరల్డ్ కప్(Under-19 World Cup) వేదికను దక్షిణాఫ్రికాకు తరలించాలని నిర్ణయించింది. అహ్మదాబాద్‌లో సమావేశమైన ఐసీసీ బోర్డు.. 2024 అండర్ -19 ప్రపంచ కప్ నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించింది. ఒమన్, యూఈఏలో టోర్నీ జరపాలనే ప్రస్తావన వచ్చినప్పటికీ.. మంచి స్టేడియాలు, ఇతర సౌకర్యాలు ఉన్న దక్షిణాఫ్రికావైపు అందరూ మొగ్గు చూపారు.
శ్రీలంక క్రికెట్ బోర్డులో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఐసీసీ పాలక మండలి ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు నవంబర్ 10న లంక క్రికెట్ బోర్డును రద్దు చేయడం సబబే అని మరోసారి తేల్చి చెప్పింది. శ్రీలంక క్రికెట్ బోర్డుపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయొద్దని ఐసీసీ బోర్డు సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇక లంకలో క్రికెట్ సాధారణంగానే ఉంటుంది అని లంక బోర్డు మాజీ అధ్యక్షుడు షమ్మీ సిల్వా(Shammi Silva) ఓ ప్రకటనలో తెలిపాడు. అండర్ -19 వరల్డ్ కప్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరుగనుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా టీ20 లీగ్ రెండో సీజన్ కూడా ప్రారంభం కానుంది.
షమీ దెబ్బకు కుప్పకూలిన లంక
సొంతగడ్డపై జరిగిన ఆసియా కప్(Asia Cup2023)లో నిరాశపరిచిన శ్రీలంక వరల్డ్ కప్‌లోనూ తేలిపోయింది. హ్యాట్రిక్ ఓటములతో ఆ జట్టు పసికూనను తలపించింది. రెగ్యులర్ కెప్టెన్ దసున్ శనక(Dasun Shanaka) గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాక.. కుశాల్ మెండిస్(Kushal Mendis) పగ్గాలు అందుకొని వరుసగా రెండు విజయాలు అందించాడు. కానీ, మళ్లీ వరుస ఓటములతో సెమీస్ రేసులో వెనకబడింది. పైగా టీమిండియా చేతిలో 302 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం లంక అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దాంతో, ఆ దేశ క్రీడా మంత్రి లంక క్రికెట్ బోర్డును రద్దు చేశాడు. అతడి నిర్ణయాన్ని సవాల్ చేసిన షమ్న్ ఏకంగా బోర్డునే రద్దు చేయాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే.