ICC : క్రికెట్లో పలు మార్పులకు శ్రీకారం చుడుతున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వన్డేల్లో బౌండరీ క్యాచ్ నిబంధనలను మార్చిన ఐసీసీ.. టెస్టుల్లో స్లో ఓవర్ రేటు (Slow Over Rate)కు చెక్ పెట్టింది. పెద్ద తలనొప్పిలా మారిన ఈ సమస్యకు పరిష్కారంగా స్టాప్ క్లాక్‌ను ప్రవేశపెట్టింది. డబ్ల్యూటీసీ (2025-27) కొత్త సీజన్ నుంచే ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని గురువారం ఐసీసీ వెల్లడించింది.
ఈ నియమం ప్రకారం ఓవర్ పూర్తి అయిన నిమిషంలోనే తర్వాతి ఓవర్ మొదలెట్టాలి. ఒకవేళ అలా చేయకుండా బౌలింగ్ జట్టు కెప్టెన్‌కు అంపైర్ రెండు హెచ్చరికలు చేస్తాడు. అయినా కూడా మూడోసారి అదే పొరపాటు జరిగితే ఆ జట్టుకు అంపైర్ ఐదు పరుగులను పెనాల్టీగా విధిస్తాడు. ఆ తర్వాత 80 ఓవర్ల వరకూ స్లో ఓవర్ రేటుకు పాల్పడితే మళ్లీ రెండు హెచ్చరికలు చేసి.. రిపీట్ అయితే మళ్లీ 5 రన్స్ జరిమానా తప్పదు. అంతేకాదు షార్ట్ రన్ తర్వాత క్రీజులో ఎవరు ఉండాలనేది బ్యాటింగ్ జట్టు నిర్ణయించుకోవచ్చని ఐసీసీ తెలిపింది. ఇదివరకే వన్డేల్లో స్టాప్ క్లాక్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
మ్యాచ్ సమయంలో బంతికి లాలాజలం(Saliva) రుద్దడంపై నిషేధం ఉంది. ఈ నిబంధనలో ఏ మార్పు చేయలేదు కానీ, ఒకవేళ బంతిపై సలైవా కనిపిస్తే వెంటనే బాల్‌ను మార్చకూడదని అంపైర్లకు ఐసీసీ సూచించింది. ఎందుకంటే.. కొత్త బంతిని తీసుకోవాలనే ఉద్దేశంతో బౌలింగ్ జట్లు లాలాజలం ఉపయోగించే అవకాశముంది. ఒకసారి బంతిని మారిస్తే.. ప్రతి జట్టు ఇదే పద్దతిని అవలంబిస్తుంది. సో.. వాళ్లకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని ఐసీసీ భావిస్తోంది. ఇంతకుముందులానే బంతి పూర్తిగా దెబ్బతిన్నప్పుడు మాత్రమే దాన్ని మార్చేందుకు అంపైర్‌కు అనుమతించింది ఐసీసీ.
అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసే డీఆర్ఎస్(DRS)పై కూడా ఐసీసీ కీలక ఆదేశాలు ఇచ్చింది. వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటైన బ్యాటర్ రివ్యూ కోరితే.. ఆల్ట్రా ఎడ్జ్‌లో బంతి ప్యాడ్‌కు తాకిందా, బ్యాట్‌కు తగిలిందా అనేది చూస్తున్నారు. ఒకవేళ అది క్యాచ్ కాదని తెలియగానే టీవీ అంపైర్ ఎల్బీగా ఔటయ్యాడా? అని చెక్ చేస్తాడు. బ్యాటర్ నాటౌట్ అని తేలితే.. అంపైర్ కాల్ నిర్ణయమే ఫైనల్. అయితే.. అప్డేట్ నిబంధన ప్రకారం బాల్ ట్రాకింగ్‌లో ఎల్బీగా కనిపిస్తే.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇస్తే ఆదే నిర్ణయం చెల్లుతుంది. రివ్యూలో అంపైర్ కాల్ అని చూపించినా సరే బ్యాటర్ డగౌట్‌కు వెళ్లాల్సిందే.