Kalvakuntla Sanjay | అతి తెలివితో సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు మొత్తాన్ని ఒక డ్రామా నడిపించారని అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మెతుకు ఆనంద్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క రోజూ మున్సిపాలిటీల అభివృద్ధి గురించి చెప్పలేదని సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తిగా, ఒక డాక్టర్‌గా, రాజ్యాంగాన్ని నమ్ముకున్న వ్యక్తిగా అన్ని వాస్తవాలను ప్రజల ముందు పెడుతున్నానని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ముందు మా నాయకుడు హరీశ్‌రావు సిట్ పేరుతో నోటీసులు ఇచ్చి మొదటి డ్రామాకు తెరలేపారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమైనా ఉందా అంటే మన్ను లేదు మాశనం లేదని అన్నారు. దావోస్ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విహార యాత్రకు చేశాడని.. మొత్తం 12 రోజుల పాటు వెళ్లిన ముఖ్యమంత్రి , దావోసు నుండి తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు గురించి చెప్పలేదని పేర్కొన్నారు. పెట్టుబడులపై మంత్రి శ్రీధర్ బాబు అయినా మాట్లాడతాడని అనుకుంటే ఆయన కూడా మాట్లాడలేదని చెప్పారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను విహార యాత్ర అంటున్నామని విమర్శించారు.
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులిచ్చి రెండో డ్రామాకు తెరలేపారని సంజయ్ మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చడంలో రేవంత్ రెడ్డి ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నప్పుడు మున్సిపాలిటీల్లో సభలు నిర్వహిస్తాడని.. మున్సిపల్ ఎన్నికలు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో సభలు నిర్వహిస్తాడని చెప్పారు. ఏదో ఒక రకంగా ప్రజలను రేవంత్ రెడ్డి మభ్య పెడుతున్నాడని మండిపడ్డారు. ఇతర పార్టీలతో అంటకాగేది రేవంత్ రెడ్డి అని.. కానీ బీఆర్ఎస్కు బీజేపీకి లింక్ పెడుతున్నారని విమర్శించారు. వీణా వాణి గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రానికి ముమ్మాటికి జాతిపిత కేసీఆరే అని స్పష్టం చేశారు.
ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని.. తగిన సమయంలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయమని సంజయ్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు కేసీఆర్ ను తిట్టడం తప్పా, అభివృద్ధి గురించి మాట్లాడడం లేదని తెలిపారు. తప్పులు చేస్తే చెప్పండి అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, ప్రతిరోజు తప్పులు చేస్తూనే ఉన్నాడని పేర్కొన్నారు.
రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో నిజాయితీగా ప్రజల సమస్యల పై చర్చ చేయాలన్నారు. ఈ బడ్జెట్ లో మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు ఇస్తామని చెప్పిన హామీలకు నిధులు కేటాయించకపోతే వారందరూ కలిసి కాంగ్రెస్కుబుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో రేవంత్ రెడ్డికి ఫేవరేట్ సబ్జెక్ట్ అయిన రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుదామని తెలిపారు. సమావేశాలకు వచ్చే ముందు దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలుసుంటే బావుంటుందని రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. ఎట్టకేలకు దేవాదుల ప్రాజెక్టు దగ్గరకు వెళ్లినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు శ్రీరామ రక్ష అని రేవంత్ రెడ్డికి తెలుసు అని సంజయ్ అన్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయాల్సిందేనని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో మాకు మైక్ ఇవ్వమని చెప్పండి, జలాల పై చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజిని లాంటి వాడు, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని విమర్శించారు. ఈసారి అయిన అసెంబ్లీనీ గౌరవించి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని సూచించారు.
పార్టీ మారారని ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిలర్‌పై అనర్హత వేటు వేశారని సంజయ్ తెలిపారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా స్పీకర్ వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ కు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రచారం చేసినా చర్యలు తీసుకోలేదని అన్నారు.