HCA | హైదరాబాద్ క్రికెట్ జట్టు ప్రతిష్ఠ నానాటికీ మసకబారుతున్నది. దేశానికి ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లను అందించిన మన హైదరాబాద్ నేడు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. పాలకుల నిర్లక్ష్య వైఖరి, అవినీతి వ్యవహారాలతో ప్రతిభకు పాతరేస్తూ పైరేవీలను ప్రోత్సహిస్తున్న వైనం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ప్రతిభను ప్రోత్సహించాల్సింది పోయి ఆర్థిక, రాజకీయ అండదండలు కల్గిన ప్లేయర్లను తీసుకోవడం హైదరాబాద్ పేలవ ప్రదర్శనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది.
దేశవాళీ రంజీ టోర్నీలో హైదరాబాద్ ప్రదర్శన చూస్తే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే. గ్రూపు-బి నుంచి బరిలోకి దిగిన మన జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓడి ఒక డ్రాతో కేవలం ఒక పాయింట్ పరిమితమై ఆఖరి స్థానానికి పరిమితమైంది. మ్యాచ్‌కు మ్యాచ్‌కు ప్లేయర్లను ఇష్టమున్నట్లు మారుస్తూ హెచ్‌సీఏ పెద్దలు చేసిన నిర్వాకం హైదరాబాద్ క్రికెట్ ప్రతిష్ఠను మంటగలుపుతున్నది. గతంలో రెండుసార్లు(1937/38, 1986/87) రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్ చివరిసారి 1999-2000 సీజన్లో రన్నరప్‌గా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండు దశాబ్దాల కాలంలో మళ్లీ టైటిల్ పోరుకు హైదరాబాద్ అర్హత సాధించలేకపోయింది. మనతో పోల్చుకుంటే ఇప్పుడిప్పుడే క్రికెట్లో ఓనమాలు దిద్దుతున్న ఈశాన్య రాష్ర్టాలు మనకన్నా మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతుండటటం నామూషీగా అనిపిస్తున్నది.
గడిచిన 20ఏండ్ల కాలంలో హెచ్‌సీఏ కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తే పాలకులు మారుతున్నా..అవినీతి వ్యవహారాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. అందినికాడికి దండుకోవడం, జట్టులో చోటు కావాలంటే లక్షలు కుమ్మరించాల్సిందేనన్న పరిస్థితికి తీసుకురావడం హైదరాబాద్‌ను అధఃపాతాళానికి పడేసిందని చెప్పొచ్చు. మరీ ఈమధ్య కాలంలో హెచ్‌సీఏ పరువు గంగలో కలిసిందని పలువురు మాజీ క్రికెటర్లు, ప్లేయర్ల తల్లిదండ్రులు బాహాటంగా విమర్శిస్తున్నారు. భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్..పగ్గాలు అందుకున్న తర్వాతనైనా హెచ్‌సీఏలో మార్పు వస్తుందని అందరూ ఆశించినా అంతకుమించి దరిద్రంగా తయారుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. పాలక సభ్యుల మధ్య ఆధిపత్య పోరు హెచ్‌సీఏ వ్యవహారాలను బజార్లో పడేసింది.
నువ్వంటే నువ్వంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం తప్పితే హైదరాబాద్ క్రికెట్ అభివృద్ధి కోసం ఏం చేద్దామన్నా ఆలోచన ఆవగింజ అంతైనా లేకపోవడం విచారకరం. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే..హెచ్‌సీఏ కార్యకలాపాలను కేవలం హైదరాబాద్ వరకే పరిమితం చేస్తూ తెలంగాణలోని మిగతా జిల్లాలపై శీతకన్ను వేయడం హెచ్‌సీఏకే చెల్లిందని చెప్పాలి. ముఖ్యంగా ప్రతిభ కల్గిన గ్రామీణ ప్రాంత ప్లేయర్లను ప్రోత్సహించాల్సింది పోయి హైదరాబాద్ వరకే ఉండటం హెచ్‌సీఏ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నది.
రంజీ టోర్నీ ఈ సీజన్లో హైదరాబాద్ ఒకే ఒక పాయింట్ పరిమితమైంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌ల్లో ఘోర ఓటమి ఎదుర్కొన్న హైదరాబాద్..తమిళనాడుతో మ్యాచ్‌ను డ్రా చేసుకుని ఒక పాయింట్ ఖాతాలో వేసుకుంది. దీంతో వచ్చే సీజన్లో ఎలైట్ డివిజన్ నుంచి కాకుండా ప్లేట్ డివిజన్‌కు ఆడాల్సిన పరిస్థితి కొని తెచ్చుకుంది.
హైదరాబాద్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ప్రతీ మ్యాచ్‌కు ప్లేయర్లను విరివిగా మార్చుకుంటూ వచ్చింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్, రోహిత్రాయుడు మినహా ప్రతీ మ్యాచ్‌కు కొత్త ప్లేయర్లను తుది జట్టులోకి తీసుకొచ్చింది. దీంతో అసలు జట్టులో స్థానం ఉంటుందా లేదా అన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య ప్లేయర్లు ఆడాల్సిన దుస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 28 మంది ప్లేయర్లను ఆటు ఇటూ మార్చిన హెచ్‌సీఏ ఈసారి 13 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చింది. సాధారణంగా అన్ని జట్లు 15 మందితో ఎంపిక చేస్తే..హైదరాబాద్‌కు వచ్చేసరికి 20మందికి పైగా ప్లేయర్లను ఎంపిక చేయడం హెచ్‌సీఏలో జరుగుతున్న అవినీతికి నిదర్శనంగా నిలిచింది.
హైదరాబాద్ తరఫున తన్మయ్ అగర్వాల్(562 పరుగులు), రోహిత్రాయుడు(575 పరుగులు), కార్తీకేయ కాక్(24 వికెట్లు) మినహా జట్టు నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన లేదు. ఈ ముగ్గురు తప్పా..ఏ ఒక్కరూ కనీసం అవకాశాన్ని సరిగ్గ సద్వినియోగం చేసుకోలేకపోయారు. చివరిసారి 2010-11లో ప్లేట్ డివిజన్‌కు పడిపోయిన హైదరాబాద్..2015-16లో 25వ స్థానానికి పడిపోయింది. 2019-20 సీజన్లో నిరాశపరిచిన హైదరాబాద్..2021లో మెరుగైన ప్రదర్శనతో తిరిగి ఎలైట్ గ్రూపులోకి వచ్చింది. కానీ ఈ సీజన్ హైదరాబాద్ సుదీర్ఘ రంజీ టోర్నీ చరిత్రలో మాయని మరక అని మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
హెచ్‌సీఏ పూర్తిగా అవినీతి కంపులో కూరుకుపోయింది. నిండా మునిగిన తర్వాత చలి ఏంది అన్నట్లు హెచ్‌సీఏ పాలకులు దున్నపోతు మీద వానపడ్డట్లు వ్యవహరిస్తున్నారు. అధ్యక్షుడు అజారుద్దీన్ నియంతృత్వ వైఖరిని పలువురు క్లబ్ సెక్రెటరీలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. జట్టులో బెర్తులను కూరగాయల మార్కెట్లో అమ్ముకున్నట్లు అమ్ముతున్నారని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రతిభ కల్గిన ప్లేయర్లను పక్కకుపెట్టి పైరేవీలకు అవకాశం ఇవ్వడం వల్లే హైదరాబాద్ పరిస్థితి ఇలా దాపురించిందని వాపోతున్నారు.
(నమస్తే తెలంగాణ క్రీడా విభాగం)
Womens U19 World Cup | అండర్-19 వరల్డ్ కప్ విజేతలకు స్వదేశంలో ఘన స్వాగతం