హైదరాబాద్, ఆట ప్రతినిధి : రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డీ చివరి మ్యాచ్‌లో బౌలర్లు రాణించడంతో హైదరాబాద్ జట్టు.. తొలిరోజే ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. స్థానిక జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన మ్యాచ్ మొదటి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే ఆలౌట్ చేసింది. ప్రతీక్ యాదవ్ (106) శతకంతో ఆకట్టుకోగా వికల్ప్ తివారి (94) తృటిలో సెంచరీ కోల్పోయాడు. ఈ ఇద్దరూ మినహా మిగిలినవారంతా చేతులెత్తేశారు.
హైదరాబాద్ సారథి మహ్మద్ సిరాజ్ (4/56) నాలుగు వికెట్లతో మెరువగా రక్షణ్ (2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హైదరాబాద్.. ఆట ముగిసేసమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 56 రన్స్ చేసింది. అమన్‌రావు (32*), అభిరాత్ (23*) క్రీజులో ఉన్నారు.