Travis Head : ఈ కాలపు విధ్వంసక ఓపెనర్లలో ట్రావిస్ హెడ్(Travis Head) ఎంత ప్రమాదకరమో తెలిసిందే. క్రీజులో ఉన్నంతసేపు తుఫాన్‌లా చెలరేగే అతడు స్కోర్‌బోర్డును రాకెట్ వేగంతో ఉరికిస్తాడు. తాజాగా ఇంగ్లండ్‌పై కూడా ఈ డాషింగ్ బ్యాటర్ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. అన్నిరకాల షాట్లతో అలరించే హెడ్‌కు ఇష్టమైన ఫార్మాట్ ఏదో తెలుసా.. టెస్టులే. అవును.. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు.
ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో శతకంతో మెరిసిన హెడ్ మ్యాచ్ అనంతరం.. ‘నాకు టీ20ల కంటే టెస్టు ఫార్మాట్ అంటేనే ఇష్టం’ అని చెప్పేశాడు. పొట్టి ఫార్మాట్లో పెట్రేగిపోయే అతడేనా ఆ మాట అన్నది అని ఆశ్చర్యపోతున్నారా? అయితే.. ఇది చదవాల్సిందే. ‘నేను టీ20ల కంటే టెస్టు క్రికెట్ ఆడడాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తాను. టెక్నిక్, పరిస్థితులు.. ఇలా ఏ కోణంలో చూసినా సరే అది చాలా కష్టమైన ఫార్మాట్. టీ20 ఫార్మాట్ దాని కంటే జఠిలమైనది.
What a run this guy is having, that’s a sixth ODI ton for Travis Head! #ENGvAUS pic.twitter.com/1dEwbRfuNr
— cricket.com.au (@cricketcomau) September 19, 2024
పొట్టి క్రికెట్లో అత్యధిక స్ట్రయిక్‌రేటుతో బ్యాటింగ్ చేయాలనే ఒత్తిడి ఉంటుంది. స్ట్రయిక్ రేటు 130, 140, 150.. ఇలా ఉండాలి. కానీ, టెస్టుల్లో అలాకాదు. జాలీగా ఆడొచ్చు. అందుకనే టీ20ల కంటే టెస్టులు ఆడడమే తేలిక’ అని 30 ఏండ్ల హెడ్ వెల్లడించాడు. ఇప్పటివరకూ 49 టెస్టులు ఆడిన హెడ్ 16, హాఫ్ సెంచరీలు, ఏడు సెంచరీలు బాదాడు. అది కూడా 64.75 స్ట్రయిక్ రేటుతో. అతడి అత్యధిక స్కోర్.. 175.
క్రీజులో హెడ్ కుదురుకున్నాడంటే ఆ రోజు బౌలర్లకు కాళరాత్రే. ఎడాపెడా బౌండరీలతో చెలరేగిపోతాడు. అతడి ఆటకు బలైన జట్లలో భారత్ మొదటిది. అవును.. అన్ని జట్ల మాట ఏమోగానీ టీమిండియా(Team India) అంటే చాలు హెడ్ శివాలెత్తిపోతాడు. నిరుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2023) ఫైనల్లో సెంచరీతో టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాడు. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో మరోసారి శతక(137) గర్జనతో ట్రోఫీని అందకుండా చేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా విధ్వంసక శతకంతో కంగారూలకు ఆరో వరల్డ్ కప్ సాధించి పెట్టాడు హెడ్.