పదిహేనేళ్లుగా పొట్టి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలని భారత జట్టు ఆశ పడుతోంది. కానీ ఆ కల నెరవేరడం లేదు. అయితే ఈసారి ఎలాగైనా టీ20 ప్రపంచకప్ ముద్దాడాలని భారత జట్టు ఆశిస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ షేన్ వాట్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై సంచలన వ్యాఖ్యలు చేశాడీ మాజీ ఆల్రౌండర్.
గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన హార్దిక్ అదరగొడుతున్నాడు. ఐపీఎల్లో కెప్టెన్గా తొలి సీజన్లోనే ట్రోఫీ ముద్దాడాడు. భారత జట్టుకు కూడా కొన్ని మరపురాని విజయాలందించాడు. ఈ క్రమంలోనే అతన్ని పొగడ్తలతో ముంచెత్తిన వాట్సన్.. ‘హార్దిక్ పాండ్యా మంచి ట్యాలెంట్ ఉన్న క్రికెటర్. బౌలింగ్లో అద్భుతమైన నైపుణ్యం ఉందతని దగ్గర. వికెట్లు తీయాలన్నా, పరుగులు కట్టడి చేయాలన్నా రెండూ చెయ్యగల సమర్ధుడు.
బ్యాటింగ్లో అతని సత్తా ఆఫ్ ది రూఫ్. తను కేవలం ఫినిషర్ మాత్రమే కాదు పవర్ హిట్టర్ కూడా. ఐపీఎల్లో అతను ఎలాంటి ఆటగాడో చూశాం కదా. తను ఒక్కడే వరల్డ్ కప్ గెలవగలడు కూడా. హార్దిక్ నిజంగా మ్యాచ్ విన్నర్’ అని కొనియాడాడు. ఆదివారం నాడు భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్ ఆడనుంది. ఇదే ఈ టోర్నీలో భారత్కు తొలి మ్యాచ్. మరి ఈ మ్యాచ్లో హార్దిక్ ఎలా ఆడతాడో చూడాలి.