Harry Brook : ఐపీఎల్ 17వ సీజన్ నుంచి వైదొలిగిన ఇంగ్లండ్ హిట్టర్ హ్యారీ బ్రూక్(Harry Brook) ఎట్టకేలకు స్పందించాడు. తమ కుటుంబంలో విషాదం నెలకొందని, అందుకనే తాను ఐపీఎల్ 17వ సీజన్ (IPL 2024) నుంచి వైదొలిగానని చెప్పాడు. భారత పర్యటనతో పాటు ఐపీఎల్ 17వ సీజన్ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో బ్రూక్ వివరించాడు.
‘ఫిబ్రవరిలో మా గ్రాండ్‌మదర్ పౌలినె బ్రూక్(Paulien Brook) చనిపోయింది. ఆమె మరణంతో మా కుటుంబమంతా పుట్టెడు దుఃఖంలో ఉంది. ఆ పరిస్థితుల్లో నేను ఫ్యామిలీతో ఉండాలనుకున్నా. అందుకనే ఐపీఎల్ 17వ సీజన్ ఆడడం లేదు’ అని బ్రూక్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించాడు.
‘గత కొన్ని ఏండ్లుగా నేను మానసిక ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నా. నాకు కుటుంబం కంటే ఏదీ ఎక్కువ కాదు. భారత పర్యటనకు ముందు గ్రాండ్‌మదర్ ఆస్పత్రి పాలైంది. ఆమె ఇంకా ఎక్కువ రోజులు బతకదని డాక్టర్లు చెప్పారు. అందుకని నేను ఆమెతో ఉండాలని అనుకున్నా. ఎందుకంటే ఆమె అంటే నాకెంతో ఇష్టం. నా బాల్యమంతా ఆమె దగ్గరే గడిపాను. అంతేకాదు ఆమె వల్లనే నేను క్రికెటర్ అయ్యాను. ఈ కష్ట సమయంలో నన్ను అర్థం చేసుకున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, ఢిల్లా క్యాపిటల్స్’కు ధన్యవాదాలు అని బ్రూక్ తెలిపాడు.
హ్యారీ బ్రూక్

ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలంలో హ్యారీ భారీ ధర పలికాడు. ఈస్టార్ బ్యాటర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లకు కొన్నది. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తరఫున 16వ సీజన్ ఆడిన బ్రూక్ తీవ్రంగా నిరాశపరిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)పై సెంచరీ తప్పిస్తే ఒక్కటంటే ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. దాంతో, అతడిపై రూ.13.25 కోట్లు వెచ్చించడం దండగా అని హైదరాబాద్ అతడిని వదిలేసింది.