Headingley Test : సొంతగడ్డపై భారత జట్టుతో హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో హ్యారీ బ్రూక్(57 నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు. ప్రసిధ్ కృష్ణ, సిరాజ్‌ల విజృంభణతో మూడో రోజు తొలి సెషన్లో సహచరులు వరుసగా పెవిలియన్‌కు క్యూ కుడుతున్నా .. ఓపికగా ఆడిన బ్రూక్ జట్టు స్కోర్ 300 దాటించాడు. వికెట్ కీపర్ జేమీ స్మిత్(29 నాటౌట్)తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత బౌలర్లను కాచుకున్న ఈ ద్వయం ఆరో వికెట్‌కు 51 రన్స్ రాబట్టింది. దాంతో, లంచ్ సమయానికి ఆతిథ్య జట్టు 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ఇప్పటికీ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 144 రన్స్ వెనకబడే ఉంది.
రెండో రోజు టీమిండియాను త్వరగా ఆలౌట్ చేసిన ఇంగ్లండ్ మూడో రోజు తొలి సెషన్లోనే కష్టాల్లో పడింది. సంచరీ వీరుడు ఓలీ పోప్(106)ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేసి ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ బెన్ స్టోక్స్(20) క్రీజులో పాతుకుపోవాలనుకున్నాడు. ప్రసిధ్, బుమ్రా, సిరాజ్‌లను కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బ్యాటు ఝులిపించలేకపోయిన స్టోక్స్.. నిదానంగా హ్యారీ బ్రూక్(57 నాటౌట్) అండగా స్కోర్‌బోర్డును నడిపించాడు. అయితే.. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు స్టోక్స్. దాంతో, 276 వద్ద సగం వికెట్లు కోల్పోయింది ఆతిథ్య జట్టు. ఆ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ జేమీ స్మిత్(29 నాటౌట్) ధాటిగా ఆడాడు. జడేజా ఓవర్లో సింగిల్ తీసిన బ్రూక్ టెస్టుల్లో 12వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో తొలి టెస్టు రసపట్టులో సాగుతోంది. తొలి రోజే కెప్టెన్ శుభ్‌మన్ గిల్(147), యశస్వీ జైస్వాల్(101) సెంచరీలతో చెలరేగి భారీ స్కోర్‌కు బాటు వేయగా.. రెండో రోజు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(138) శతకంతో మెరిశాడు. దాంతో, భారత్ 500 ప్లస్ కొడుతుందని, ఇక ఇంగ్లండ్‌కు కష్టమేనని అభిమానులు అనుకున్నారు. కానీ, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 471కే ఆలౌటయ్యింది. రెండో రోజు గిల్ పంత్ ఔటయ్యాక వచ్చిన భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. కరుణ్ నాయర్ డకౌట్ కాగా.. జడేజా, శార్థూల్ నిరాశపరిచారు. పేసర్ జోష్ టంగ్(4-86) విజృంభణతో టకటకా టెయిలెండర్ల వికెట్లు కోల్పోయింది టీమిండియా. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు బుమ్రా షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ జాక్ క్రాలే()ను ఔట్ చేసి ఆతిథ్య జట్టును దెబ్బ కొట్టాడు. అయితే.. ఓపెనర్ బెన్ డకెట్(62), ఓలీ పోప్(106)లు కీలక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. అర్ధ శతకం బాదిన డకెట్‌ను బుమ్రా బౌల్డ్ చేసి రెండో వికెట్ అందించాడు. ఆ కాసేపటికే జో రూట్‌ను(28) సైతం వెనక్కి పంపిన యార్కర్ కింగ్ టీమిండియాను పోటీలోకి తెచ్చాడు. కానీ, పోప్ సూపర్ సెంచరీతో ఇంగ్లండ్ కోలుకుంది. రెండో రోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.