Women Cricket : వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా చిరకాల కలను సాకారం చేసుకున్న భారత మహిళల జట్టు లార్డ్స్ (Lords)లో చెలరేగిపోయింది. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్‌లో చిరస్మరణీయ విజయంతో అమ్మాయిలు తక్కువేమీ కాదని నిరూపించింది హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) బృందం. ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్‌లో 142 ఏళ్లకు జరిగిన మొట్టమొదటి మహిళల టెస్టులో సంపూర్ణ అధిపత్యంతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశలో వెనుదిరిగినందున.. ఐకైక టెస్టులో విజయంతో ఊరట చెందుతాం అని పేర్కొన్న హర్మన్‌ప్రీత్ అనుకున్నంత పని చేసి చూపింది. ఈ సంచలన విక్టరీ క్రెడిట్ క్రాంతి, యస్తిక, మంధానకే కాదు.. జట్టులోని ప్రతిఒక్కరికి దక్కుతుంది. శ్రేయాస్ అయ్యర్ సేన చతికిలపడిందనే బాధను పోగొట్టిన అమ్మాయిలను చూసి పాఠాలు నేర్వాల్సిందే.
విదేశీ పర్యటనల్లో విజయం చిన్న విషయమేమి కాదు. ఆతిథ్య జట్టుకు కొట్టినపిండి లాంటి పరిస్థితుల నడమ అవకాశాలు సృష్టించుకుంటేనే గెలుపు తలుపు తట్టగలం. అది సాధ్యమవ్వాలంటే జట్టు కూర్పుతో పాటు ఓపెనర్ల నుంచి శుభారంభం లభించడం ముఖ్యం. లార్డ్స్ టెస్టులో భారత జట్టు అదే చేసి చూపింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(83, 70) రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధ శతకాలతో ఇంగ్లండ్ బౌలర్ల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసి.. తర్వాతి బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించింది.
Captain Harmanpreet Kaur and #TeamIndia fans soaking it all in at Lord’s 🤝🏆#ENGvIND | @ImHarmanpreet pic.twitter.com/9EhcRCXoMP
— BCCI Women (@BCCIWomen) July 13, 2026
ఓపెనర్ షఫాలీ వర్మ(0), జెమీమా రోడ్రిగ్స్(35) విఫలమైనా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(58), దీప్తి శర్మ(57)లు ఎప్పటిలానే కీలక ఇన్నింగ్స్ ఆడి తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరందించారు. అనంతరం బౌలింగ్ దళంలోని 22 ఏళ్ల క్రాంతి గౌడ్(5-37) సంచలన స్పెల్‌తో రెండో రోజే మ్యాచ్ భారత జట్టు చేతుల్లోకి వచ్చేసింది. మరో ఎండ్‌లో సయాలీ సత్ఘరే(2-40) వికెట్ల వేటతో విరుచుకుపడగా ఆతిథ్య జట్టు 170కే కుప్పకూలింది. 115 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో మ్యాచ్‌పై పట్టుబిగించిన భారత్.. ఇంగ్లండ్‌కు పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు.

కెరీర్ ఆరంభం నుంచి గాయాలతో జట్టులోకి వస్తూ పోతున్న యస్తికా భాటియా(113) తన విలువేంటో చాటుకుంది. స్మృతి మంధాన సలహాలతో ఆత్మవిశ్వాసం కూడదీసుకున్న ఈ డాషింగ్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో ఆధిక్యాన్ని మూడొందలు దాటించింది. యస్తికా ఔటైనా.. రీచా ఘోష్(50 నాటౌట్) మెరుపు షాట్లతో అలరించింది. 341/7వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ అదే క్రమశిక్షణను చూపింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో ‘లార్డ్స్ హానర్స్ బోర్డు’లో పేరు సంపాదించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన క్రాంతి గౌండ్.. మళ్లీ వేటాడింది. అంతర్జాతీయ క్రికెట్‌ను ఘనంగా ముగించాలనుకున్న ఓపెనర్ టమ్మీ బ్యూమంట్(0), వెటరన్ హీథర్ నైట్(13)లను డగౌట్ చేర్చిందీ స్పీడ్‌స్టర్. అనంతరం.. సయలీ(2-24) జోరు చూపగా.. స్నేహ్ రాణా(4-42), దీప్తి శర్మ(2-36)లు తిప్పేయడంతో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం చరిత్రాత్మక విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై తమ ఆధిపత్యాన్ని నిరూపిస్తూ పదకొండుకు 11 విక్టరీలతో సత్తా చాటింది టీమిండియా.
1. 1976-1999 మధ్య 26 మ్యాచుల్లో ఒకేఒక విజయం.. ఐదు ఓటములు, 20 మ్యాచ్‌లు డ్రా.
2. 2002-2006 మధ్య పరిస్థితిలో మార్పు వచ్చింది. 8 మ్యాచుల్లో రెండు విజయాలు.. ఒకే పరాజయం.. ఐదు డ్రా.
3. 2014 నుంచి ప్రస్తుతం.. 9 మ్యాచుల్లో 6 విజయాలు.. ఒక ఓటమి.. రెండు డ్రా
భారీ విజయం మాత్రం ఇంగ్లండ్‌పైనే. 2023లో డీవై పాటిల్ స్టేడియంలో 347 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది.