Harbhajan Singh : ఐపీఎల్ 16వ సీజన్లో రింకూ సింగ్(Rinku Singh) నిజంగా ఒక సెన్సేషన్. కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) విజయాల వెనక ఈ స్టార్ ఆటగాడు ఉన్నాడు. క్రీజులోకి వచ్చాడంటే విజయమే లక్ష్యంగా పోరాడే అతడి నైజం చూసి మాజీ క్రికెటర్లు, అభిమానులు ఫిదా అవుతున్నారు. ఒత్తిడిలోనూ సాధికారిక ఇన్నింగ్స్ ఆడుతున్న రింకూను మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) ఆకాశానికెత్తేశాడు.
రింకూ క్రికెట్ జర్నీ ఓ జీవిత పాఠమని, అతడు యువతకు పెద్ద ఇన్స్పిరేషన్ అని భజ్జీ అన్నాడు. ‘రింకూ నిజంగా స్ఫర్తినిచ్చే ఆటగాడు. జీవితంలో ఎన్నో కష్టాలను చవిచూశాడు. అయినా అధైర్యపడలేదు. ఎంతో కష్టపడి అవన్నీ దాటుకుని లక్ష్యం వైపు సాగాడు. ఈరోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సంచలన ఆటగాడిగా నిలిచాడు. అతను భారత జట్టు జెర్సీ వేసుకొనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని భజ్జీ తెలిపాడు.
ఐపీఎల్ 16వ సీజన్లో ఆడుతున్న ప్రతి జట్టులో స్టార్లకు కొదవలేదు. కానీ, ఒక పేదింటి కుర్రాడు తన అద్భుతమైన ఆటతో అందరి కళ్లను తనవైపు తిప్పుకున్నాడు. మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తూ క్రికెట్ పండితుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ఒంటి చేత్తో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును గెలిపిస్తున్న అతడి పేరే రింకూ సింగ్. ఆఖరి ఓవర్లలో విధ్వంసం సృష్టిస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఉంటే చాలు విజయంపై ధీమా. ఆఖరి బంతి వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్న అతను ఐదు సిక్స్‌లతో స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో ఈ ఉత్తరప్రదేశ్ ప్లేయర్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. 11 మ్యాచుల్లో అతను 151.12 స్ట్రైక్ రేటుతో 337 రన్స్ కొట్టాడు.
గుజరాత్ టైటాన్స్‌పై విజయం తర్వాత రింకూ, నితీశ్ రానా
ఈ సీజన్లో రింకూ సింగ్ మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో అతడికి బౌలింగ్ చేయడం కత్తమీద సాములాంటిదే. అవును.. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై రింకూ సింగ్ సంచలన బ్యాటింగ్ చేశాడు. నాటౌట్‌గా నిలిచి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్లో ఐదు బంతులకు ఐదు సిక్స్‌లు కొట్టాడు. 24 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63 రన్స్ కొట్టాడు. దాంతో, ఓటమి అంచున ఉన్న కోల్‌కతా ఒక వికెట్ తేడాతో అనూహ్యంగా విజయం సాధించింది.
పంజాబ్ కింగ్స్‌పై కూడా రింకూ తన మార్క్ ఆట చూపించాడు. దంచికొడుతున్న ఆండ్రూ రస్సెల్ ఔటయ్యాక జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఆఖరి బంతికి బౌండరీ కొట్టి కోల్‌కతాను గెలిపించాడు. దాంతో, నితీశ్ రానా సేన ప్లే ఆఫ్ అవకాశాలు మెరగుపడ్డాయి. 2017లో ఐపీఎల్లో ఆరంగేట్రం చేసిన రింకూ పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. 2018 నుంచి కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.