Cristiano Ronaldo : ఫుట్‌బాల్ మాంత్రికుడు క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్న భారత అభిమానులకు బ్యాడ్‌న్యూస్. ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్ (AFC Champions League) మ్యాచ్ కోసం అతడు ఇండియాకు రావడం లేదు. అల్ నస్రీ క్లబ్ (Al-Nassr) యాజమాన్యం రొనాల్డోకు ఎంతగానో చెప్పిచూసినా సరే అతడు మాత్రం నో చెప్పేశాడు. వర్క్‌లోడ్ కారణంగానే ఈ స్టార్ ప్లేయర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దాంతో.. లియోనల్ మెస్సీ(Lionel Messi)తో పాటు రొనాల్డో ఆటను చూసి మురిసిపోవాలనుకున్న అభిమానులకు పెద్ద షాక్ తగిలింది.
ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్ 2లో రొనాల్డో సారథ్యం వహిస్తున్న అల్ నస్రీ క్లబ్ గ్రూప్ డీలో ఉంది. అయితే.. గత రెండు మ్యాచుల్లో ఈ ఫార్వర్డ్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగిన అల్ నస్రీ జట్టు రెండింటా గెలుపొందింది. దాంతో.. కెప్టెన్ లేకుండానే 28 మందితో కూడిన అల్ నస్రీ బృందం సోమవార రాత్రి గోవా చేరుకోనుంది. అనంతరం.. బుధవారం స్థానిక నెహ్రూ స్టేడియంలో గోవా ఎఫ్‌సీ, ఆల్ నస్రీ క్లబ్ తలపడుతాయి.
🚨 Cristiano Ronaldo will not be included in the squad traveling to India for the match against FC Goa. pic.twitter.com/UUo0Qepkvg
— TCR. (@TeamCRonaldo) October 19, 2025
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని ఏఎఫ్సీ హౌస్‌లో ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్ 2025-26 సీజన్ డ్రా తీశారు. అదే గ్రూప్‌లో ఇండియన్ సూపర్ లీగ్(ISL)కు చెందిన ఎఫ్‌సీ గోవా (FC Goa) జట్టు కూడా ఉండడంతో ఈ వెటన్ ప్లేయర్ రాక అనివార్యమని అందరూ ఊహించారు. కానీ, బిజీ షెడ్యూల్ కారణంగా విశ్రాంతి తీసుకోవాలని రొనాల్డో భావించాడు. ఇదే విషయాన్ని అతడు మేనేజ్మెంట్కు తెలియచేశాడు. దాంతో.. గోవాలో రొనాల్డో ఆట చూసి తరించాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలనుంది.
గ్రూప్ డీలో ఎఫ్‌సీ గోవా, అల్ జవ్రా ఎఫ్‌సీ (ఇరాక్), ఎఫ్‌సీ ఇస్తిక్లోల్(తజకిస్థాన్) జట్లు ఉన్నాయి. రొనాల్డో కెప్టెన్సీలో అద్భుత విజయాలు సాధిస్తున్న అల్ నస్రీ క్లబ్ సౌదీ ప్రో లీగ్‌లో మూడో స్థానంతో ఈ లీగ్‌కు అర్హత సాధించింది. ఐఎస్ఎల్ 2024/25 లీగ్ సీజన్లో గోవా టీమ్ రెండో స్థానంలో నిలిచింది. మే నెలలో సూపర్ కప్‌లో విజేతగా నిలిచి ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది గోవా. అదే జోష్‌తో ఒమన్‌కు చెందిన అల్ సీబ్ జట్టును ఓడించి ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్‌లో ఆడే అవకాశం దక్కించుకుంది.