Konda Surekha | సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి కొండా సురేఖ దంపతులు కలిశారు. వారితో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారు. ఇటీవల మంత్రి కొండా సురేఖను ముఖ్యమంత్రి టార్గెట్ చేశారంటూ ఆమె తనయ సుస్మిత సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎంను కొండా దంపతులు కలుకవడం ఇక అన్ని వివాదాలు సద్దుమణిగినట్టేనని ప్రచారం జరుగుతున్నది. కొండా దంపతులతో పాటు భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్ కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటికి చేరుకొని దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ తొలగింపు, ఆయన కోసం పోలీసులు మంత్రి ఇంటికి వెళ్లడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పార్టీలో వివాదాలు లేకుండా చూడాలని కోరినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఇటీవల మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పని చేసిన సుమంత్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లడం వివాదాస్పదమైన విషజ్ఞం తెలిసిందే. ఎలాంటి నోటీసులు లేకుండా మంత్రి ఇంటికి వస్తారని ప్రశ్నిస్తూ.. సుస్మిత పోలీసులను అడ్డుకున్నారు. ఓ సిమెంట్ కంపెనీ వ్యవహారంలో సీఎం రేవంత్ మనిషి రోహిన్‌రెడ్డి గన్‌తో వచ్చారని.. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే బీసీ మంత్రి అయిన కొండా సురేఖను సీఎం, మంత్రి పొంగులేటి, వేం నరేందర్‌రెడ్డి టార్గెట్ చేశారంటూ సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. తాము ఎవరినీ బెదిరించలేదని ఆమె స్పష్టం చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారాన్ని మంత్రి కొండా సురేఖ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో పాటు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకూడదని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం.