ఢిల్లీ: త్వరలో యూఏఈలో జరుగబోయే ఆసియా కప్‌లో దాయాది పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను ఆడేందుకు అంగీకరించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. దేశం కంటే ఏదీ ముఖ్యం కాదని భజ్జీ అన్నాడు. ‘వాళ్లకు ఏది ముఖ్యమో ఏదీ కాదో అర్ధం చేసుకోవాలి.
నా వరకైతే సరిహద్దుల్లో ఉన్న సైనికులు.. వాళ్ల జీవితాన్ని కూడా త్యాగం చేసి దేశం కోసం సేవలందిస్తున్నారు. వారి త్యాగం ఎంతో గొప్పది. దానితో పోలిస్తే ఒక క్రికెట్ మ్యాచ్ అనేది చాలా చిన్న విషయం. కేంద్ర ప్రభుత్వం సైతం దీనిపై నిర్దిష్టమైన విధానంతో ఉంది. ఇలాంటి సమయంలో మనం దాయాదితో క్రికెట్ ఆడేందుకు వెళ్లబోతున్నాం.
సరిహద్దు సమస్యలకు పరిష్కారం దొరికే దాకా క్రికెట్ అనేది అంత ప్రాధాన్యమేమీ కాదు. ఆట కంటే దేశం ముఖ్యం. దేశం వల్లే మనకు గుర్తింపు దక్కుతుంది’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇటీవల ముగిసిన లెజెండ్స్ లీగ్‌లో భారత్.. పాక్‌తో గ్రూప్ దశతో పాటు సెమీస్ మ్యాచ్‌నూ రద్దు చేసుకున్న విషయం విదితమే.