ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై పోరాడిన గుజరాత్…మలి పోరులో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. సొంతగడ్డపై సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ ఈసీజన్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సాయి సుదర్శన్ సాధికారిక అర్ధసెంచరీతో పోరాడే స్కోరు అందుకున్న టైటాన్స్.. నిలకడైన బౌలింగ్‌తో ముంబైని కట్టడి చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ విజృంభణతో గుజరాత్ భారీ విజయాన్ని అందుకుంది.
GT vs MI | అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్ జూలు విదిల్చింది. శనివారం సొంతగడ్డపై ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ 36 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 196/8 స్కోరు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్(41 బంతుల్లో 63, 4ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు బట్లర్(39), కెప్టెన్ గిల్(38) రాణించారు. ముఖ్యంగా గత సీజన్ ఫామ్‌ను తిరిగి కొనసాగిస్తూ సుదర్శన్ అహ్మదాబాద్‌లో గత ఆరు ఇన్నింగ్స్‌లో ఐదు అర్ధసెంచరీలు సాధించాడు. హార్దిక్‌పాండ్యా(2/29) రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై 160/6 స్కోరు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ(2/18), సిరాజ్(2/34) ముంబై పతనంలో కీలకమయ్యారు. పిచ్ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ అటు పేసర్లతో పాటు స్పిన్నర్లు రాణించడంతో గుజరాత్ విజయం నల్లేరు నడక అయ్యింది. ప్రసిద్ధ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
మొదట టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా..గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్లు సుదర్శన్, గిల్..గుజరాత్‌కు మెరుగైన శుభారంభం అందజేశారు. గిల్ బౌండరీల ఖాతా తెరువగా, సుదర్శన్..బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన ముజిబ్ ఐదో ఓవర్లో సుదర్శన్ ఓ ఫోర్, సిక్స్‌తో చెలరేగితే..గిల్ ఫోర్ అరుసుకోవడంతో 15 పరుగులు వచ్చి చేరాయి. అదే దూకుడు కొనసాగిస్తూ చాహర్ బౌలింగ్‌లో గిల్ సిక్స్, ఫోర్ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై వికెట్ కోల్పోకుండా 66 పరుగులు చేసింది.
ఈ సీజన్లో పవర్‌ప్లేలో ఒక జట్టు వికెట్ కోల్పోకపోవడం ఇది తొలిసారి. పవర్‌ప్లే తర్వాత ఇన్నింగ్స్ మందగించగా, హార్దిక్ 9వ ఓవర్లో నమన్ క్యాచ్ ద్వారా గిల్ ఔట్ కావడంతో తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత బట్లర్ వచ్చి రావడంతోనే సిక్స్, ఫోర్‌తో విరుచుకుపడ్డాడు. సుదర్శన్, బట్లర్ర వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఇన్నింగ్స్ జోరందుకుంటున్న తరుణంలో బట్లర్‌ను ఔట్ చేయడం ద్వారా గుజరాత్‌కు ముజిబ్ బ్రేక్‌లు వేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా..సుదర్శన్ సమయోచితంగా వ్యవహరిస్తూ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 50 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. షారుఖ్(9), సుదర్శన్, తెవాటియా(0), రూథర్‌ఫర్డ్(18), రషీద్‌ఖాన్(6), సాయికిషోర్(1) వెంటవెంటనే ఔటయ్యారు.
లక్ష్యఛేదనలో ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ తొలి ఓవర్లో ఓపెనర్ రోహిత్‌శర్మ(8) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. స్వింగ్‌ను సరిగ్గా అర్థం చేసుకోని రోహిత్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. రికల్టన్(6)కూడా సిరాజ్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. దీంతో 35 పరుగులకే ముంబై ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో తిలక్‌వర్మ(39), సూర్యకుమార్(48) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ప్రసిద్ద్ బౌలింగ్‌లో తిలక్, సూర్య వెనుదిరిగారు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రాబిన్ మింజ్(3) ఘోరంగా నిరాశపరిచాడు ఆఖర్లో కెప్టెన్ పాండ్యా(11), నమన్ ధీర్(18 నాటౌట్), సాంట్నర్(18 నాటౌట్) పోరాడినా లాభం లేకపోయింది. గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సాధించాల్సిన రన్‌రేట్ అంతకంతకూ పెరగడంతో ముంబై ఓటమి ఎదుర్కొవాల్సి వచ్చింది.
గుజరాత్: 20 ఓవర్లలో 196/8(సుదర్శన్ 63, బట్లర్ 39, హార్దిక్ 2/29, రెహమాన్ 1/28),
ముంబై: 20 ఓవర్లలో 160/6(సూర్యకుమార్ 48, తిలక్ 39, ప్రసిద్ధ్ 2/18, సిరాజ్ 2/34)