ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ మరో స్ఫూర్తిదాయక ప్రదర్శన. లక్నోతో గత మ్యాచ్‌లో స్వల్ప స్కోరును నిలబెట్టుకున్న గుజరాత్..ఈసారి ముంబై ఇండియన్స్ పని పట్టింది. పడుతూలేస్తూ సాగుతున్న ముంబైను టైటాన్స్ సమిష్టి ప్రదర్శనతో చిత్తుచేసింది. గిల్, మనోహర్, మిల్లర్ మెరుపులతో భారీ స్కోరు అందుకున్న టైటాన్స్.. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైకి ముకుతాడు వేసింది. నూర్ అహ్మద్, రషీద్‌ఖాన్, మోహిత్ ముంబై బ్యాటర్లకు కళ్లెం వేశారు. ఈ విజయంతో గుజరాత్ రెండో స్థానానికి చేరుకోగా, ముంబైకి ‘ఏడు’పే మిగిలింది.
అహ్మదాబాద్ : ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు. లీగ్‌లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులను ఆకట్టుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 55 పరుగుల తేడాతో ముంబైపై అద్భుత విజయం సాధించింది. గిల్(34 బంతుల్లో 56, 7ఫోర్లు, సిక్స్)కు తోడు మిల్లర్(22 బంతుల్లో 46, 2ఫోర్లు, 4 సిక్స్‌లు), మనోహర్ (21 బంతుల్లో 42, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ బ్యాటింగ్‌తో టైటాన్స్ 20 ఓవర్లలో 207/6 స్కోరు చేసింది. చావ్లా(2/34) రెండు వికెట్లు తీశాడు. నిర్దేశిత లక్ష్యఛేదనలో ముంబై 152/9 స్కోరుకు పరిమితమైంది. నూర్ అహ్మద్ (3/37), రషీద్‌ఖాన్ (2/27), మోహిత్‌శర్మ (2/38) ధాటికి నేహాల్ వదెరా (40), గ్రీన్ (33) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. మనోహర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ముంబై ప్చ్
గుజరాత్ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయింది. కెప్టెన్ రోహిత్‌శర్మ(2) ఆదిలోనే నిరాశపర్చగా, ఫామ్‌లేమితో సతమతమవుతున్న మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(13) మెరుగైన శుభారంభం అందించలేకపోయాడు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ షమీ, హార్దిక్ పాండ్యా స్వింగ్‌తో ముంబై బ్యాటర్లను తిప్పలు పెట్టారు. ఈ కారణంగా తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి ముంబై 29 పరుగులకే పరిమితమైంది. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో వచ్చిన రషీద్‌ఖాన్..ముంబైని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. బంతి తేడాతో కిషన్‌తో పాటు ఇంప్యాక్ట్ ప్లేయర్ తిలక్‌వర్మ(2) వెంటవెంటనే ఔటయ్యారు. కిషన్..లిటిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరుగగా, వర్మ..వికెట్ల ముందు దొరికిపోయాడు. మరోవైపు తానేం తక్కువ కాదన్నట్లు నూర్ అహ్మద్..11వ ఓవర్లో గ్రీన్(33), టిమ్ డేవిడ్(0)ను పెవిలియన్ పంపి ముంబై గెలుపు ఆశలపై నీళ్లు గుమ్మరించాడు. వీర్దిదరి నిష్క్రమణ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటుకు పనిచెప్పాడు. రషీద్‌ఖాన్, నూర్ అహ్మద్ లక్ష్యంగా బౌండరీలు కొట్టిన సూర్య..రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. ఆఖర్లో నేహాల్ వదెరా(40) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు.
దంచికొట్టారు
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తమ సొంత మైదానంలో దుమ్ముదులిపారు. అర్జున్ టెండూల్కర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ముంబైకి ఫలితం వచ్చింది. ఓపెనర్ సాహా(4) కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (13)..గిల్‌కు జత కలిశాడు. వీరిద్దరు ఇన్నింగ్స్‌ను గాడిలో పడేసే ప్రయత్నం చేశారు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. అయితే చావ్లా వేసిన మరుసటి ఓవర్ తొలి బంతికే భారీ షాట్ కోసం ప్రయత్నించిన హార్దిక్.. లాంగ్‌ఆన్‌లో సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
దీంతో రెండో వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. పదో ఓవర్‌కు దిగిన కార్తీక్‌ను లక్ష్యంగా చేసుకున్న విజయ్‌శంకర్(19) రెండు ఫోర్లు, ఒక భారీ సిక్స్‌తో చెలరేగగా, గిల్ 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్, శంకర్ వెంటవెంటనే ఔటయ్యారు. ఈ తరుణంలో మిల్లర్, మనోహర్..ముంబై బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. అప్పటి వరకు పొదుపుగా బౌలింగ్ చేసిన చావ్లా ఆఖరి ఓవర్లో వీరిద్దరు కలిసి 17 పరుగులు పిండుకున్నారు. అదే ఊపులో గ్రీన్ వేసిన 18వ ఓవర్లో మనోహర్ రెండు భారీ సిక్స్‌లతో చెలరేగితే మిల్లర్ మరో సిక్స్‌తో 22 పరుగులు వచ్చాయి. మనోహర్‌ను మెరిడిత్ ఔట్ చేయడంతో ఐదో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. తెవాటియా వచ్చి రావడంతోనే సిక్స్‌తో విరుచుకుపడగా, మిల్లర్ రెండు సిక్స్‌లు ఖాతాలో వేసుకున్నాడు. ఆఖరి ఓవర్లో తెవాటియా రెండు సిక్స్‌లతో స్కోరు 200 మార్క్ అందుకుంది.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్ : 20 ఓవర్లలో 207/6(గిల్ 56, మిల్లర్ 46, చావ్లా 2/34, బెహెన్‌డార్ఫ్ 1/37),
ముంబై: 20 ఓవర్లలో 152/9(నేహాల్ 40, గ్రీన్ 33, నూర్ 3/37, రషీద్ 2/27)