IPL 2025 : ప్రపంచ క్రికెట్లో బెస్ట్ ఫీల్డర్ ఎవరు? అంటే ఒకప్పుడు జాంటీ రోడ్స్ పేరు చెప్పేవారు అందరు. ఇప్పుడు మాత్రం న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్(Glenn Philiphs) గుర్తుకు వస్తాడు అందరికి. ఈ కివీ ఆటగాడు మామూలోడు కాదు. బ్యాటుతో, బంతితో రాణించడమే కాదు తన మెరుపు ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను రెప్పపాటులో పెవిలియన్ పంపించగలడు కూడా. బౌండరీ లైన్ వద్ద పక్షిలా గాల్లోకి ఎగురుతూ నమ్మశక్యంకానీ రీతిలో బంతిని అడ్డుకుంటాడు ఫిలిఫ్స్. ఇలా మూడు విభాగాల్లో ఫ్యాన్స్‌ను అలరిస్తున్న కివీస్ బ్యాటర్ ఒకప్పుడు పైలట్ కావాలనుకున్నాడట.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిలిఫ్స్ మార్చి 25న పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. తన మనసులోని మాట చెప్పాడు. ‘నాకు విమానాలు అంటే ఇష్టం. అవి గాల్లో ఎగురుతుంటే ఆసక్తిగా గమనించేవాడిని. పైలట్ల మాదిరిగా నాకూ ఆకాశంలో విమానం నడపాలని అనిపించేది. అసలు నాకు వాటి మీద ఎందుకు ఇష్టం పెరిగిందో తెలియదు.
throwback to this insane fielding by glenn phillips pic.twitter.com/bSsuquMIef
— Saharsh (@whysaharsh) March 9, 2025
ఎలాగైనా సరే పెద్దయ్యాక మాత్రం పైలట్ అవ్వాలనుకున్నా. అయితే.. క్రికెటర్‌గా మారాను. అందుకే కాబోలు మైదానంలో పక్షిలా గాల్లో ఎగురుతూ బంతిని ఒడిసిపడతాను. బౌండరీ లైన్ వద్ద ఒంటి చేత్తో సిక్సర్లు ఆపడంలో ఉండే కిక్కే వేరు. ఒకవేళ క్రికెట్‌ను కెరియర్‌గా ఎంచుకోక పోయిఉంటే కచ్చితంగా పైలట్ అయ్యేవాడిని’ అని వరల్డ్ క్లాస్ ఫీల్డర్ వెల్లడించాడు. ఈమధ్యే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఈ కివీ ఆల్‌రౌండర్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ కొట్టిన బంతిని గాల్లోకి డైవ్ చేస్తూ.. అద్భుతమైన క్యాచ్ పట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఫిలిఫ్స్ తల్లిదండ్రులది దక్షిణాఫ్రికా. అయితే.. అతడికి ఐదేళ్లు ఉన్నప్పుడు వాళ్ల కుటుంబం న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు వలస వెళ్లింది. అక్కడికి వెళ్లాక ఫిలిఫ్స్ క్రికెట్ మీద ఇష్టం పెంచుకున్నాడు. జూనియర్ జట్టు తరఫున స్పిన్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తూ.. ఫీల్డింగ్‌లో అద్భుతమై క్యాచ్‌లు అందుకునేవాడు. దాంతో, సెలక్టర్ల దృష్టిలో పడిన ఫిలిఫ్స్ 2017లో సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు.
Won’t blame Shubman Gill today he was playing so well Glenn Phillips was just too good there 💔 pic.twitter.com/o66oLTVv7k
— Ahmed Says (@AhmedGT_) March 9, 2025
టీ20 స్పెషలిస్ట్ అయిన ఇతడు 2021లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), ముంబై ఇండియన్స్ జట్లకు ఆడిన కివీ బ్యాటర్‌ను 2025 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.