Graham Thorpe : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ (Graham Thorpe) ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. గత రెండేండ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న థోర్ప్(55) ఆగస్టు 5న తుదిశ్వాస విడిచాడు. అయితే.. ఈ మాజీ ఆటగాడి మృతిపై ఆయన భార్య అమందా (Amanda) సంచలన వ్యాఖ్యలు చేసింది. థోర్ప్ అనారోగ్యంతో చనిపోలేదని, ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆమె తెలిపింది.
‘థోర్ప్ మానసిక ఒత్తిడి, ఉద్రేకం వంటి సమస్యలతో బాధ పడేవారు. తాను లేకుంటే కుటుంబం అయినా హాయిగా బతుకుతుందని ఆయన భావించారు. అయితే.. నా భర్త మరణం నన్ను ఎంతో షాక్కు గురి చేసింది’ అని అమంద వెల్లడించింది.
‘థోర్ఫ్ను ఎంతో ప్రేమించే భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయనకు మేమంటే ఇష్టమే. థోర్ప్ 2022లోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కానీ, మేమంతా ఆయన్ను కాపాడుకున్నాం. ఆ తర్వాత ఆయన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. మేము ఆయన్ను డిప్రెషన్ నుంచి బయటపడేసేందుకు ఎన్నో విధాలా ప్రయత్నించాం. కానీ, ఆయన ఒత్తిడిని జయించలేకపోయాడు. గత కొంతకాలంగా థోర్ప్ ఆరోగ్యం సరిగ్గా లేదు. దాంతో, ఆయన తాను లేకుంటే కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారని అనుకున్నాడు. అందుకనే సూసైడ్ చేసుకున్నాడు’ అని అమంద చెప్పుకొచ్చింది.
థోర్ఫ్ మరణవార్తను ఇంగ్లండ్ క్రికెట్, వేల్స్ క్రికెట్ బోర్డులు ధ్రువీకరించాయి. 1993 నుంచి 2005 వరకు ఇంగ్లండ్ తరఫున ఆడిన థోర్ప్.. వంద టెస్టులు, 82 వన్డేలలో ప్రాతినిథ్యం వహించాడు. టెస్టులలో 44.66 సగటుతో 6,774 పరుగులు చేయగా వన్డేలలో 2,830 రన్స్ సాధించారు. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించాక కొన్నాళ్లపాటు అఫ్గానిస్థాన్ జట్టుకు హెడ్కోచ్గా పనిచేశారు. థోర్ప్ మృతి పట్ల ఇంగ్లండ్ ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు సంతాపం వ్యక్తం చేశారు.