Chinnaswamy Stampede : భారత క్రీడా చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదమైన చిన్నస్వామి తొక్కిసలాట (Chinnaswamy Stampede) లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషాద సంఘటనకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)దే బాధ్యత అని ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం తేల్చి చెప్పగా.. తాజాగా ప్రభుత్వ కమిటీ కూడా నివేదికలో పలు అంశాల్ని ప్రస్తావించింది. భారీ జనసమీకరణకు చిన్నస్వామి స్టేడియం ఏమాత్రం సురక్షితం కాదని శనివారం తమ రిపోర్టులో పేర్కొంది. అంతేకాదు మైదానం డిజైన్, నిర్మాణం సామర్ధ్యానికి అనుగుణంగా లేదని జస్టిస్ మోహన్ మైఖేల్ డిసున్హా (Justice John Michael D’CunhaR) కమిషన్ తెలిపింది.
జూన్ 4న చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటపై సమగ్ర విచారణ చేపట్టిన జస్టిస్ మోహన్ మైఖేల్ కమిషన్.. ఘటనకు దారి తీసిన పరిస్థితులను వివరించింది. ‘పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వచ్చి మ్యాచ్‌లను వీక్షించేందుకు చిన్నస్వామి స్టేడియం డిజైన్, నిర్మాణం అనుగుణంగా లేవు. స్టేడియంలోకి అనుమతించే.. బయటకు వెళ్లడానికి ఏర్పాటు చేసిన గేట్లు రోడ్డు మీది ఫుట్‌పాత్‌కు సమీపంలో ఉన్నాయి. స్టేడియం బయట అభిమానులు గుమికూడకుండా చూసేందుకు సరిపోను స్థలం.. ఇతర ఏర్పాట్లు ఏమీ లేవు. దాంతో, అభిమానులు రోడ్డు పక్కగానే క్యూ లైన్లో వేచి ఉండి స్టేడియంలోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈక్రమంలో రహదారిపై వెళ్లేవాళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
#WATCH | Bengaluru, Karnataka: Visuals from outside Chinnaswamy Stadium, where the slippers and shoes are scattered. A stampede occurred here, claiming the lives of 11 people and injuring 33 people. pic.twitter.com/5DBhW9IFli
— ANI (@ANI) June 4, 2025
అందుకే.. స్టేడియంలో తక్షణమే అవసరమైన మార్పులు, మరమ్మతులు చేయాల్సి ఉంది. ఆ తర్వాతే పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ను అనుమతించాలి. సరైన భద్రతా ఏర్పాట్లు చేయకుండా తొక్కిసలాటకు కారణమైన ఆర్సీబీ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ మీనన్, ఈవెంట్ సంస్థకు చెందిన వెంటక్ వర్దన్, కర్నాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడు రఘురాం భట్.. మాజీ సెక్రటరీ శంకర్, మాజీ కోశాధికారి జైరామ్లపై చర్యలు తీసుకోవాలి’ అని కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. త్వరలోనే మహరాజా టీ20 టోర్నమెంట్ చిన్నస్వామి వేదికగా జరుగనుంది. అయితే.. తొక్కసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని ఎవరనీ అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది కర్నాటక క్రికెట్ సంఘం.
The Central Administrative Tribunal has found #RCB “prima facie responsible” for the stampede that occurred on June 4 outside the M Chinnaswamy Stadium during the team’s victory celebrations, killing 11.
Details ⬇️https://t.co/aO7ZE8inml#CRicketTwitter #BengaluruStampede pic.twitter.com/kmVaXIuitV
— Cricbuzz (@cricbuzz) July 1, 2025
పదిహేడేళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్లో తొలిసారి ఆర్సీబీ ఛాంపియన్‌గా అవతరించింది. దాంతో, ఫ్రాంచైజీ విక్టరీ పరేడ్‌కు పిలుపునిచ్చింది. స్వరాష్ట్రంలో జూన్ 4న నిర్వహించ తలపెట్టిన విజయోత్సవ యాత్రలో అభిమానులు భారీగా పాల్గొనాలని ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా పెట్టింది ఆర్సీబీ మేనేజ్మెంట్. ఇంకేముంది.. చిన్నస్వామి స్టేడియానికి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 30 వేల మంది సామర్థ్యం మాత్రమే ఉన్న మైదానానికి సుమారు 3 లక్షల మంది వచ్చారు. అంతమందిని నియంత్రించేందుకు సరైన పోలీస్ బలగాలు కూడా అక్కడ లేవు. ఒక్కసారిగా స్టేడియం గేట్లు తెరవగానే.. అభిమానులు దూసుకొచ్చారు. ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాట జరిగింది. యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనలో 11 మంది మరణించగా.. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.