కాసిపేట : ‘ కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ’ అయ్యింది ఆదివాసీ గిరిజనుల పరిస్థితి. ఇప్పటికే కనీస వసతులు లేక అల్లాడుతున్న ప్రజలకు వర్షాకాలంలో రోడ్డు సమస్య మరింత జఠిలంగా మారింది. మంచిర్యాల జిల్లా ( Mancherial district) కాసిపేట మండలం దేవాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దాపూర్ పావులగూడెంకు (Pavulagudem ) వెళ్లే రోడ్డు ఇటీవల కురిసిన వర్షానికి మొత్తం బురదమయంగా మారింది. దీంతో గిరిజనులు రాకపోకలు సాగించటానికి నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల రోడ్డుపై వేసిన మొరంతో బురదగా మారి కనీసం నడవలేని పరిస్థితికి చేరుకున్నామని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీ కోలాం పీవీటీజీ గ్రామాలను అధికారులు పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. గతంలో కనీసం నడవడానికైనా రోడ్డు ఉండేదని, ఆ రోడ్డుపై మొరం బదులు బురద మట్టి వేసి రోడ్డును నాశనం చేశారని పేర్కొంటూ రోడ్డుపై కొద్దిసేపు నిరసన తెలిపారు.
వెంటనే తమకు రోడ్డు వేయకపోతే దిగుతామని కోలాం సేవ సంఘం (Kolam Seva Sangam) జిల్లా అధ్యక్షుడు ఆత్రం మహేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కొడప భీంరావు, గ్రామ పటేల్ టేకం మెంగు, టేకం భీంరావు, టేకం భగవంతరావు, ఆత్రం భీంరావు, టేకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.