KTR | బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల తీరుపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్లో శనివారం నాడు నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సుకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పోలీసులను ఉద్దేశించి అన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మిత్తితో సహా జవాబు చెబతామని హెచ్చరించారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్టయి పోలీస్ స్టేషన్లో ఉంటే ఆయనింటికి పోలీసులు వెళ్లారని కేటీఆర్ తెలిపారు. గెల్లు భార్య ఫోన్ ఇవ్వనని చెప్పినందుకు ఆమెపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారని మండిపడ్డారు. అసలు పోలీసులకు మెదడు ఉందా? చదువుకున్నారా? లేదా అని ప్రశ్నించారు. నల్లబాలు రీట్వీట్ చేసినందుకు 20 రోజులు జైలుకు పంపించారని చెప్పారు. రాహుల్ గాంధీ చెప్పే మొహబ్బత్ కా దుఖాన్ ఇదేనా అని నిలదీశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. రేవంత్ రెడ్డికి బానిసలా పనిచేస్తున్న అధికారులను హెచ్చరించారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని.. మిత్తీతో సహా జవాబు చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.
మూసీలో లక్షన్నర కోట్ల కుంభకోణం బయటపెడితే సీఎం రేవంత్ రెడ్డి లాగు తడిసిందని అన్నారు. మనం పోరాటం చేస్తేనే మూసీ కుట్రలు ఆగాయని చెప్పారు. లగచర్లలో రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ కోసం గిరిజనుల భూములు లాక్కోవడానికి కుట్రలు పన్నారని విమర్శించారు. లగచర్ల ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అండగా నిలిచిందని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూములపై పోరాటం చేసింది విద్యార్థులేనని అన్నారు. మీ పోరాటాలకు మన లీగల్ సెల్ అండగా నిలిచిందని తెలిపారు. పోరాడిన వారికే రాజకీయంగా అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. లీగల్ సెల్ ద్వారా జిల్లాల వారీగా విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.