ఢాకా : భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ వ్యవహారాలు కొత్త మలుపు తీసుకున్నాయి. గత కొన్ని నెలలుగా అన్చిశితి వాతావరణంతో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్‌లో క్రికెట్‌ను పావుగా మార్చుకుంటూ భారత ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓవైపు మైనార్టీ హిందువులను విచక్షణా రహితంగా చంపేస్తూ రాక్షసానందం పొందుతున్న బంగ్లా తాజాగా బీసీసీఐ లక్ష్యంగా పావులు కదుపుతున్నది. ఐపీఎల్ నుంచి తమ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తీసివేయడాన్ని బూచిగా చూపిస్తూ త్వరలో భారత్‌లో మొదలయ్యే టీ20 ప్రపంచకప్ టోర్నీకి తమ దేశ జట్టును పంపించమంటూ బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. తమ దేశ క్రికెటర్ల భద్రత దృష్ట్యా బంగ్లా ఆడే మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలంటూ కొత్త పల్లవి అందుకుంది. ముస్తాఫిజుర్‌ను తీసేయాలంటూ కేకేఆర్ మేనేజ్మెంట్ను బీసీసీఐ ఆదేశించిన కొన్ని గంటల వ్యవధిలోనే అటు బంగ్లా అధికార వర్గాలతో పాటు బీసీబీ సభ్యులు హుటాహుటిన సమావేశమై..భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు.
శనివారం సాయంత్రమే సమావేశమైన ఆ దేశ క్రీడా సలహాదారు అసిఫ్ నజ్రుల్..బంగ్లాదేశ్ జట్టు ఎట్టి పరిస్థితుల్లో భారత్‌లో పర్యటించేది లేదని స్పష్టం చేశాడు. దీన్ని ఆసారాగా చేసుకుంటూ కొన్ని గంటల వ్యవధిలోనే నజ్రుల్ మాటలకు వంతపాడుతూ బీసీబీ పెద్దలు అధికారికంగా ఒక ప్రకటన వెలువరించారు. మెగాటోర్నీకి ముందు భారత్‌తో పాటు బీసీసీఐని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అందుకు అనుగుణంగా ఫిబ్రవరి 7వ తేదీన భారత్‌లో మొదలయ్యే టీ20 ప్రపంచకప్ టోర్నీకి తమ జాతీయ జట్టును పంపవద్దని బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ‘గడిచిన 24 గంటలుగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. భారత్‌లో బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్‌ల పరిస్థితిపై చర్చించాం. ప్రస్తుత పరిస్థితుల్లో తమ దేశ క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందికి భద్రత విషయంలో ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తాం. వారి సూచనలకు అనుగుణంగా భద్రతా కారణాల రిత్యా మెగాటోర్నీ కోసం భారత్‌లో పర్యటించవద్దన్న నిర్ణయానికి వచ్చాం. అక్కడ జరిగే మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలంటూ ఐసీసీకి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని బీసీబీ పేర్కొంది.
ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్త్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను అక్కడి నుంచి శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి బీసీబీ ప్రాథమికంగా విజ్ఞప్తి చేసింది. మెగాటోర్నీని నిర్వహించే ఐసీసీ ఈ విషయంలో కలుగజేసుకోవాలని కోరింది. సాధ్యమైనంత తొందరగా దీన్ని పరిష్కరించాలంటూ లేఖలో అభ్యర్థించే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో బంగ్లా మ్యాచ్‌లను తరలించే విషయంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
బీసీబీ కంటే ముందే నిర్ణయం : ఓవైపు ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ తీసివేయడాన్ని సాకుగా చూపిస్తూ భారత్‌ను ఇరకాటంలో పెట్టేందుకు బంగ్లా ప్రభుత్వ పెద్దలు పిచ్చి ప్రయత్నాలు చేశారు. దేశ క్రికెట్ బోర్డు కంటే ముందే భేటీ అయ్యి భారత్‌పై బురద చల్లేందుకు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగా ఓవైపు తమ దేశ అంతర్గత భద్రతపై అన్ని దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు కొత్త పల్లవి అందుకున్నారు. క్రికెట్ విషయంలో బీసీసీఐ మతాన్ని తీసుకొస్తుందంటూ ఆ దేశ క్రీడా సలహాదారు అసిఫ్ నజ్రుల్ కొత్త భాష్యం చెప్పాడు. దీన్ని బలపరుస్తూ బెంగాల్ భాషలో తన అధికారిక ఫేస్బుక్ పేజీలో వ్యాసం రాసుకొచ్చాడు. ముస్తాఫిజుర్ ఉదంతాన్ని బూచిగా చూపిస్తూ మెగాటోర్నీ కోసం భారత్‌కు రాలేమంటూ ప్రగల్భాలు పలికాడు. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని రాతపూర్వకంగా ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలంటూ బీసీబీకి ఆదేశాలు ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చాడు. బీసీబీతో కాంట్రాక్టు ఉన్న ఏ క్రికెటర్ కూడా ఐపీఎల్లో ఆడకుండా చూడాలంటూ బీసీబీకి సూచించాడు.
బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించేందుకు నజ్రుల్ ప్రయత్నాలు చేస్తున్నాడు. తమ దేశ క్రికెటర్‌ను ఐపీఎల్ నుంచి తీసేసారన్న అక్కసుతో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలను నిషేధించాలంటూ బంగ్లా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ శాఖకు సూచించినట్లు పేర్కొన్నాడు. మొత్తంగా ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తీసివేయడాన్ని అనుకూలంగా మలుచుకుంటూ మెగాటోర్నీ మ్యాచ్‌లకు లింక్ పెడుదామనుకుంటున్న బంగ్లా ఆశలు అడిఆశలయ్యేలా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌లో ఆడకపోవడం వల్ల నష్టపోయేది బంగ్లానే తప్ప మరొకరు కాదని పలువురు క్రీడాభిమానులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ విషయమై బీసీసీఐ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.