Team India | ఢిల్లీ : చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ఇండియా చేస్తున్న ప్రయోగాలతో తుది కూర్పులో గందరగోళం నెలకొంది. రెండో వన్డేతో సారథి రోహిత్ ఫామ్ అందుకోగా ప్రతిష్టాత్మక టోర్నీ ముందు కోహ్లీ కూడా భారీ ఇన్నింగ్స్ బాదేస్తే భారత అభిమానుల బెంగ తీరినట్టే అవుతుంది. కానీ ఇప్పుడు దీనికంటే ఆందోళన కలిగిస్తున్న అంశం.. ఐదో స్థానంలో ఎవర్ని ఆడించాలి? అనేదే. వన్డే ప్రపంచకప్‌లో ఈ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి నిలకడగా ఆడిన కేఎల్ రాహుల్‌ను కాదని ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కోచ్ గౌతం గంభీర్.. అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేసి ఐదో స్థానంలో ఆడిస్తున్నాడు. ఈ ప్రయోగంతో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కుదిరి భారత్‌కు మెరుగైన ఫలితాలే వస్తున్నాయి. గత రెండు మ్యాచ్‌లలో అక్షర్.. (52, 41) అంచనాలకు మించి రాణించాడు. శ్రేయస్, హార్దిక్‌తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కానీ ఆరో స్థానంలో వచ్చిన రాహుల్ మాత్రం (2,10) విఫలమవుతున్నాడు. అక్షర్ రూపంలో ఈ ప్రయోగం విజయవంతమైనా రాహుల్‌కు వచ్చేసరికి మాత్రం వికటించిందని చెప్పక తప్పదు. ఎందుకంటే రాహుల్‌కు ఐదులో మంచి రికార్డు ఉంది.
రాహుల్ వన్డే కెరీర్లో 79 మ్యాచ్‌లాడి 2,863 పరుగులు చేస్తే అందులో నంబర్.5లో 30 ఇన్నింగ్స్‌లు ఆడి 1,259 రన్స్ సాధించాడు. ఈ క్రమంలో అతడి సగటు 60గా నమోదుకాగా 2 శతకాలు, 10 అర్ధ శతకాలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అతడు ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 450 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. జట్టు కోసం ఓపెనింగ్ నుంచి ఏడో స్థానం దాకా ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండే రాహుల్.. గత రెండు మ్యాచ్‌లలో మాత్రం లయ తప్పాడు. ఆరో స్థానంలో అతడు 6 ఇన్నింగ్స్‌లలో 42 పరుగులు మాత్రమే చేశాడు. గంభీర్, టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయంపై రవిశాస్త్రి, కృష్ణమచారి శ్రీకాంత్ వంటి సీనియర్లు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. రాహుల్ పరిస్థితిని చూస్తుంటే బాధగా ఉందని, ప్రయోగాలను పక్కనబెట్టి అతడిని ఐదో స్థానంలో కొనసాగిస్తేనే భారత్‌కు మంచిదని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పంత్‌ను కాదని రాహుల్‌కు అవకాశమిచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. చాంపియన్స్ ట్రోఫీలో ఒకవేళ పంత్‌ను ఆడిస్తే తుది కూర్పు విషయంలో మళ్లీ గందరగోళం నెలకొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఐదో స్థానంలో అక్షర్, ఆ తర్వాత పంత్, జడేజా కూడా ఎడమ చేతి వాటం బ్యాటర్లే. అదీగాక ఆఖరి ఓవర్లలో రాహుల్‌తో పోలిస్తే పంత్ కాస్త దూకుడుగా ఆడగలడు. మరి రాహుల్ విషయంలో రోహిత్, గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.