BCCI : భారత జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) సహాయక సిబ్బంది వేటలో పడ్డాడు. తన ఐపీఎల్ సహచరులను తన టీమ్‌లో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నాడు. అందులో భాగంగానే దక్షిణాఫ్రికా దిగ్గజం మోర్నీ మోర్కెల్ (Morne Morkel)ను బౌలింగ్ కోచ్‌గా తీసుకునేందుకు గౌతీ సిద్ధమవుతున్నాడు. గంభీర్, మోర్కెల్‌లు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కలిసి ఆడారు. అంతేకాదు లక్నో సూపర్ జెయింట్స్‌కు గంభీర్ మెంటార్‌గా, మెర్కెల్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించారు. దాంతో, మోర్కెల్ పేరును అతడు బీసీసీఐకి పంపే అవశాశముంది.
అయితే.. బీసీసీఐ మాత్రం ఆ పోస్ట్‌ను భారత సీనియర్ పేసర్‌కు ఇవ్వాలని భావిస్తోంది. 2011 వరల్డ్ కప్ హీరో అయిన జహీర్ ఖాన్ (Zaheer Khan) లేదా లక్ష్మీపతి బాలాజీలకు బౌలింగ్ యూనిట్ బాధ్యతలు అప్పగించాలని జై షా బృందం అనుకుంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి.
గంభీర్ తొలుత ఫీల్డింగ్ కోచ్‌గా సఫారీ మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ (Jonty Rhodes) పేరును ప్రతిపాదించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు గంభీర్ మెంటార్‌గా ఉన్న సయమంలో రోడ్స్ ఆ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. అందుకని అతడిని తీసుకోవాలని అనుకున్నాడు. అయితే.. బీసీసీఐ మాత్రం అందుకు ససేమిరా అంది. దాంతో, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన రియాన్ టెన్ డస్చేట్(Ryan ten Doeschate)కు ఆ పదవి కట్టబెట్టేందుకు గంభీర్ ప్రయత్నిస్తున్నాడని సమాచారం. ఐపీఎల్ 17వ సీజన్ విజేతగా నిలిచిన కోల్‌కతాకు గంభీర్ మెంటార్‌గా ఉండగా.. డస్చేట్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.

రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ రెండేండ్లు కొనసాగనున్నాడు. జూలై 26న జరుగబోయే శ్రీలంక సిరీస్‌తో కోచ్‌గా గంభీర్‌కు తొలి పరీక్ష ఎదురవ్వనుంది. ఈ సిరీస్ ముగియగానే సొంత గడ్డపై బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో భారత జట్టు ఢీ కొట్టనుంది. అంతేకాదు వచ్చే ఏడాది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్, చాంపియన్స్ ట్రోఫీలు గంభీర్ పనితీరుకు అద్ధం పట్టనున్నాయి.
