KTR | గోపాన్‌పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా ప్రారంభించకపోవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీ బాసుల దగ్గరకు చక్కర్లు కొట్టడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లకు తిరగడంలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని విమర్శించారు. సమర్థ ప్రభుత్వం, అవగాహన లేని నాయకత్వం ఉంటే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు.
నల్లగండ్ల, గోపాన్‌పల్లి, తెల్లాపూర్ చందానగర్వాసులకు మేలు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గోపాన్‌పల్లి ఫ్లైఓవర్‌ను నిర్మించిందని కేటీఆర్ తెలిపారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం లేదని అన్నారు. ఢిల్లీకి చక్కర్లు కొట్టడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరగడం మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తమ వ్యక్తిగత పీఆర్ మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాల మీద లేదని మండిపడ్డారు. వెంటనే గోపాన్‌పల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.