e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News Chanu Mirabai | మీరాబాయ్ చాను.. క‌ట్టెలు మోసిన చేతులే సిల్వ‌ర్ మెడ‌ల్ తీసుకొచ్చాయి

Chanu Mirabai | మీరాబాయ్ చాను.. క‌ట్టెలు మోసిన చేతులే సిల్వ‌ర్ మెడ‌ల్ తీసుకొచ్చాయి

టోక్యో: ఆమెకు బ‌రువులు మోయడం కొత్త కాదు. ఒక‌ప్పుడు కుటుంబం క‌డుపు నింప‌డానికి క‌ట్టెలు మోసింది. ఇప్పుడు 140 కోట్ల ప్ర‌జ‌ల ఆశ‌ల భారాన్ని మోస్తూ ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ తీసుకొచ్చింది. ఆమె పేరు మీరాబాయ్ చాను (Chanu Saikhom Mirabai) ఇది ఆమె స‌క్సెస్ స్టోరీ.

కుటుంబంలో చిన్న‌దైనా..

ఆమెది ఈశాన్య భార‌తం. మ‌ణిపూర్ కొండ‌కోన‌ల్లో పుట్టి పెరిగింది. ఆరుగురు సంతానంలో అంద‌రి కంటే చిన్న‌ది. కానీ కుటుంబ బ‌రువు బాధ్య‌త‌లు మోయ‌డంలో మాత్రం పెద్ద‌దే. ఇంఫాల్‌కు 20 కిలోమీట‌ర్ల దూరంలోని నాంగ్‌పాక్ కాక్‌చింగ్ అనే ఊళ్లో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది సైఖోమ్ మీరాబాయ్ చాను. కొండ‌కోనల్లో క‌ట్టెలు కొట్టుకొచ్చి క‌డుపు నింపుకోవ‌డమే ఆ కుటుంబానికి తెలిసింది. అంద‌రి కంటే చిన్న‌దైనా కూడా మొద‌టి నుంచీ బ‌రువులు మోయడంలో మీరాబాయ్ దిట్ట‌. 12 ఏళ్ల వ‌య‌సులోనే త‌న కంటే పెద్ద‌వాళ్ల‌యిన తోబుట్టువులు కూడా మోయ‌లేని బ‌రువును త‌ల‌పై ఎత్తుకొని 2 కిలోమీట‌ర్లు అవ‌లీల‌గా న‌డిచేసింది. స‌రిగ్గా 8 ఏళ్ల ఆ త‌ర్వాత ఆ అమ్మాయే 2014 కామ‌న్వెల్త్ గేమ్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచింది.

ఐదేళ్ల వ‌య‌సు నుంచే..

- Advertisement -

మీరాబాయ్ ఐదేళ్ల వ‌య‌సులోనే త‌ల‌పై ఓ నీటి బ‌కెట్‌ను పెట్టుకొని కొండ‌ను కూడా సునాయాసంగా ఎక్క‌డం నేర్చుకుంది. అప్పుడ‌ది కుటుంబ అవ‌స‌రం. కానీ అవ‌స‌ర‌మే త‌న కెరీర్‌గా మారుతుంద‌ని ఆమె ఎప్పుడూ ఊహించ‌లేదు. అలా నీటి బ‌కెట్ల‌తోపాటు క‌ట్టెలు మోయ‌డం క్ర‌మంగా మీరాబాయ్‌ను రాటుదేల్చింది. 14 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చేస‌రికి ఆమె వెయిట్‌లిఫ్టింగ్ వైపు చూసింది. తన‌ను ఆ దిశ‌గా ఇన్‌స్పైర్ చేసింది ఏడుసార్లు వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్స్ సిల్వ‌ర్ మెడ‌లిస్ట్ కుంజ‌రాణి దేవి. ఆమెను చూసిన త‌ర్వాతే ఇక బ‌రువులు మోయ‌డాన్ని తన కెరీర్‌గా మ‌ల‌చుకోవాల‌ని మీరాబాయ్ నిర్ణ‌యించుకుంది.

వెదురు బొంగుల‌కు బ‌రువులు త‌గిలించుకొని..

చిన్న‌త‌నం నుంచీ కుటుంబం కోసం ఎంత క‌ష్ట‌ప‌డిందో.. వెయిట్‌లిఫ్టింగ్ శిక్ష‌ణ కోసం కూడా ఆమె అంతగానే చెమ‌టోడ్చింది. త‌న ఊరికి 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ట్రైనింగ్ సెంట‌ర్‌కు రోజూ వెళ్లి వ‌చ్చేది. మొద‌ట కోచ్ అనితా చాను ఆమెకు శిక్ష‌ణ ఇచ్చింది. అక్క‌డ మీరాబాయ్ మొద‌ట వెదురు బొంగుల‌నే బార్‌బెల్స్‌గా ఉప‌యోగించి బ‌రువులు మోసింది. అలా త‌న టెక్నిక్‌ను మెరుగుప‌ర‌చుకున్న ఆరు నెల‌ల త‌ర్వాత సాంప్ర‌దాయ వెయిట్‌లిఫ్టింగ్ టూల్స్ వైపు మ‌ళ్లింది.

అలా రెండేళ్ల‌లోనే స‌బ్‌జూనియ‌ర్ స్టేట్ లెవ‌ల్ చాంపియ‌న్‌షిప్‌లో గోల్డ్ మెడ‌ల గెలిచే స్థాయికి చేరింది. 2011లో జూనియ‌ర్ కేట‌గిరీలో తొలిసారి నేష‌న‌ల్ మెడ‌ల్ గెలిచింది. అదే కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. ఆ మెడ‌ల్ త‌న‌ను త‌న ఆరాధ్య వెయిట్‌లిఫ్ట‌ర్ కుంజ‌రాణిదేవి ద‌గ్గ‌రికి తీసుకెళ్లింది. అలా 2014లో కామ‌న్వెల్త్ గేమ్స్ రూపంలో తొలిసారి అంత‌ర్జాతీయ వేదిక‌పై స‌త్తా చూపే అవ‌కాశం ద‌క్కింది. తొలిసారే 48 కేజీల విభాగంలో సిల్వ‌ర్‌తో మెరిసింది.

రియో గేమ్స్‌లో నిరాశ‌

2014లో ఏషియ‌న్ గేమ్స్‌లో భారీ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగినా ఉత్త చేతుల‌తోనే తిరిగి వ‌చ్చింది. కానీ 2016 రియో ఒలింపిక్స్‌కు మాత్ర‌మే అర్హ‌త సాధించ‌గ‌లిగింది. కానీ అక్క‌డ తీవ్ర నిరాశ ఎదురైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో ఒక్క‌సారి కూడా బ‌రువు ఎత్త‌లేక నిరాశ‌తో వెనుదిరిగింది. ఈ ఊహించ‌ని ప‌రిణామంతో తీవ్రంగా క‌ల‌త చెందిన ఆమె.. గేమ్‌ను వ‌దిలేయాల‌ని భావించింది. కానీ కొంత‌కాలం త‌ర్వాత ఆ బాధ నుంచి బ‌య‌ట ప‌డిన మీరాబాయ్.. బ‌లంగా పుంజుకుంది.

ఏడాది త‌ర్వాత జ‌రిగిన వ‌ర‌ల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియ‌న్‌షిప్స్‌లో ఏకంగా గోల్డ్ మెడ‌ల్ గెలిచింది. క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి తర్వాత వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ గెలిచిన రెండో ఇండియ‌న్ వెయిట్‌లిఫ్ట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది. ఆ త‌ర్వాతే ఆమెకు అత్యున్న‌త పౌర‌పుర‌స్కారం రాజీవ్ ఖేల్‌ర‌త్న ద‌క్కింది. 2018లో ప‌ద్మ‌శ్రీ అవార్డుతో ప్ర‌భుత్వం స‌త్క‌రించింది. ఇప్పుడు ఎన్నో ఆశ‌ల‌తో టోక్యో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన మీరాబాయ్‌.. ఏకంగా సిల్వ‌ర్ మెడ‌ల్‌తో చ‌రిత్ర సృష్టించింది.

ఇవి కూడా చదవండి..

Tokyo Olympics: హాకీలో ఇండియా బోణీ.. న్యూజిలాండ్‌పై విజయం

మీరాబాయి చానుకు మంత్రి కేటీఆర్‌ అభినందన

Tokyo Olympics: సూప‌ర్ వుమ‌న్ మీరాబాయ్‌పై ప్ర‌శంస‌ల వెల్లువ‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana