Wrestler Kajal | అమ్మాన్(జోర్డాన్): ప్రతిష్ఠాత్మక అండర్-17 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ల పసిడి పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే నలుగురు మహిళా రెజ్లర్లు స్వర్ణ పతకంతో మెరువగా, తాజాగా కాజల్ ఈ జాబితాలో చేరింది. శుక్రవారం జరిగిన మహిళల 69కిలోల ఫ్రీస్టయిల్ విభాగం తుది పోరులో కాజల్ 9-2తో అలెగ్జాండ్రా రైబక్(ఉక్రెయిన్)పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన కాజల్..ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా పాయింట్లు ఖాతాలో వేసుకుంది.
మరోవైపు 46కిలోల విభాగంలో శ్రుతిక..యు కత్సుమి(జపాన్) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. 40కిలోల పోరులో రాజ్‌బాల 11-5తో మోనాక ఉమ్కెవా(జపాన్)పై గెలిచి కాంస్యం సొంతం చేసుకుంది. 53కిలోల కాంస్య పతక పోరులో ముస్కాన్..ఇసాబెల్లా గొంజాలెజ్(అమెరికా)పై గెలిచింది. మొత్తంగా ఈ టోర్నీలో భారత మహిళా రెజ్లర్లు ఐదు స్వర్ణాలు సహా ఒక రజతం, మూడు కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే భారత పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లర్లు నిరాశపరిచారు. ఐదుగురు బరిలోకి దిగినా ఒక్కరు కూడా సెమీస్‌కు అర్హత సాధించలేక చతికిలపడ్డారు. హర్ష్, వివేక్ మాత్రమే తొలి రౌండ్లో గెలిచినా రెండో రౌండ్లో చేతులెత్తేశారు.