సినీతారల అభిమానుల మధ్య ‘ఫ్యాన్ వార్’ గురించి తెలిసిందే! ‘మా హీరో గొప్ప!’ అంటే.. ‘మా హీరో ఇంకా గొప్ప!’ అంటూ మాటల యుద్ధాలకు దిగడం ఎప్పటినుంచో ఉన్నదే! అయితే.. ఎక్కువగా అగ్రహీరోల అభిమానుల మధ్యే ఇలా ఫ్యాన్వార్ జరుగుతుంటుంది. తాజాగా, బాలీవుడ్ టాప్ హీరోయిన్ల ఫ్యాన్స్.. సోషల్‌మీడియా వేదికగా బాహాబాహీకి దిగారు. ‘మా హీరోయిన్ గ్రేట్!’ అంటే.. ‘మా హీరోయిన్ గ్రేటెస్ట్!’ అంటూ ట్వీటుతున్నారు.
దీపికా పదుకొణె, అలియా భట్.. ఇద్దరూ బాలీవుడ్లో అగ్రతారలుగా కొనసాగుతున్నారు. భారత్‌లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలో అనేక ఫ్యాషన్ బ్రాండ్స్‌కు అంబాసిడర్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా, ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘లెవిస్’.. తన గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అలియాను ఎన్నుకున్నది. ఇప్పటిదాకా ‘లెవిస్’కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న దీపికాను తప్పించింది.
ఈ నిర్ణయం ఆమె అభిమానులను నిరాశతోపాటు ఆగ్రహానికి గురిచేసింది. ఒక సాధారణ బ్రాండ్ మార్పు.. దీపికా-అలియా ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. దీపికాను గ్లోబల్ అంబాసిడర్‌గా ఎందుకు తొలగించారనీ, దీపికా స్థానంలోకి రావడానికి అలియాకు ఉన్న అదనపు అర్హతలు ఏమిటంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీపిక స్థానాన్ని అలియా భట్ దొంగిలించిందని కొందరు కామెంట్ చేయగా.. అలియా అసూయతోనే ఈ పనిచేసిందని మరికొందరు ట్వీట్ చేశారు. ఈ విమర్శలు వైరల్ కావడంతో.. అలియా అభిమానులు ఎదురుదాడికి దిగారు.
‘దీపిక కూడా అంతకుముందున్న అంబాసిడర్ నుంచి లాక్కున్నదే కదా!’ అంటూ ట్వీట్ చేస్తున్నారు. మధ్యలో ‘లెవిస్’ సంస్థనూ ట్యాగ్ చేస్తున్నారు. అయితే.. ఈ వివాదాలు, విమర్శలన్నీ అభిమానుల మధ్యే! దీపిక గానీ, అలియా గానీ ఈ వ్యవహారంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. వారివారి సినిమాల షూటింగ్స్‌లో తీరిక లేకుండా ఉన్నారు. గతేడాది వచ్చిన ‘జిగ్రా’ సినిమాలో చివరిసారిగా కనిపించింది అలియా భట్! ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టినా.. ఆమె చేతిలో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి.
‘ఆల్ఫా’ అనే గూఢచారి చిత్రంతోపాటు సంజయ్ లీలా భన్సాలీ సినిమా ‘లవ్ అండ్ వార్’లోనూ ఈ క్రేజీ హీరోయిన్ నటిస్తున్నది. మరోవైపు దీపికా పదుకొణె కూడా ఈ ఏడాది ఇంకా తెరపై కనిపించలేదు. ఆమె నటించిన కల్కి 2898 ఏడీ, సింగం అగైన్ చిత్రాలు గతేడాది విడుదలయ్యాయి. అల్లు అర్జున్-అట్లీ కాంబోలో వస్తున్న ప్రతిష్ఠాత్మక సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్‌తోపాటు షారుక్ సరసన ‘కింగ్’లోనూ నటించనున్నది దీపికా.