బాలీవుడ్ హీరోయిన్లపై తన తండ్రికి సదభిప్రాయం ఉండేది కాదని అంటున్నాడు శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా! కానీ, శిల్పాతో తన వివాహం తర్వాత.. ఆయన అభిప్రాయం పూర్తిగా మారిందని చెబుతున్నాడు. తాజాగా, బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ ‘ఫరాఖాన్’ నిర్వహించిన ఓ చిట్‌చాట్‌లో శిల్పాశెట్టితో కలిసి రాజ్‌కుంద్రా పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా.. తన ప్రేమకథను, పెళ్లి ముచ్చట్లనూ పంచుకున్నాడు. తనది ‘లవ్‌ఎట్ ఫస్ట్ సైట్’ అని చెప్పుకొచ్చాడు. శిల్పను చూసినప్పుడే ఆమెతో ప్రేమలో పడిపోయానని వెల్లడించాడు. అయితే, తాను ఒక బాలీవుడ్ నటిని ప్రేమించడం, ఆమెతో డేటింగ్లో ఉండటం.. తన తండ్రికి ఏమాత్రం ఇష్టంలేదట. ‘సినిమా హీరోయిన్లు సిగరెట్లు తాగుతారు. వాళ్లకు మద్యం తీసుకొనే అలవాటు ఉంటుంది. అలాంటి హీరోయిన్‌తో నీకేంటి ప్రేమ?’ అంటూ ఎప్పుడూ విమర్శించేవాడట.
రాజ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా.. ‘మీరు ఏదేదో ఊహించుకునే ముందు.. ఒక్కసారి శిల్పను కలవండి. ఆ తర్వాత మీ అభిప్రాయం చెప్పండి’ అని అన్నాడట. “అలా.. వారిద్దరి సమావేశం తర్వాత మా నాన్న మనసులోని సందేహాలన్నీ తొలగిపోయాయి. నేనే కాదు.. నా తల్లిదండ్రులు కూడా శిల్పతో మొదటిచూపులోనే ప్రేమలో పడ్డారు” అంటూ చెప్పుకొచ్చాడు రాజ్ కుంద్రా! ఇప్పుడు తనకన్నా శిల్పతోనే ఎక్కువగా సమయం గడుపుతుంటారనీ, కూతురికన్నా ఎక్కువగా చూసుకుంటారనీ వెల్లడించాడు. దానికి పక్కనే ఉన్న శిల్పాశెట్టి స్పందిస్తూ.. “నా అత్తమామలు రాజ్ కన్నా ఎక్కువగా నన్నే ప్రేమిస్తారు” అంటూ చెప్పుకొచ్చింది.
2007లో యూకేలో నిర్వహించిన శిల్పా పెర్ఫ్యూమ్ లైన్ (ఎస్2) ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్ కుంద్రా-శిల్పా శెట్టి మొదటిసారి కలుసుకున్నారు. శిల్పాశెట్టి ప్రారంభించిన పెర్ఫ్యూమ్ వ్యాపారానికి.. బిజినెస్‌మ్యాన్ అయిన రాజ్ ప్రచారంలో సహాయం అందించాడు. అలా మొదలైన వారి పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఈ జంట 2009లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి కొడుకు వియాన్, కుమార్తె సమీషా ఉన్నారు.
వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రాకు సినిమాలపైనా ఆసక్తి. నిర్మాతగా వ్యవహరిస్తూనే.. పలు చిత్రాల్లోనూ నటించాడు. 2023లో వచ్చిన ‘యూటీ69’తో నటుడిగా తెరంగేట్రం చేశాడు. ‘వెల్కం 2 కరాచీ’లోనూ చిన్నపాత్రలో మెరిశాడు. ప్రస్తుతం ‘మెహర్’ చిత్రంలో పూర్తిస్థాయి ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. ఇక శిల్పాశెట్టి విషయానికి వస్తే.. అందం, అభినయంతోపాటు తనదైన వ్యక్తిత్వంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది ఈ పొడుగుకాళ్ల సుందరి. 1993లో షారుక్ ఖాన్ సరసన ‘బాజీగర్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాలతో టాప్ హీరోయిన్గా ఎదిగింది. సాహసవీరుడు సాగరకన్య, ఆజాద్, వీడెవడండీ బాబూ లాంటి సినిమాలతో తెలుగువారికీ దగ్గరైంది.