హైదరాబాద్, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ): ‘బహుజన రాజ్యాధికారమే ఈ దేశంలో మిగిలిన అంతిమ విప్లవం.. దానికోసం ప్రగతిశీలవాదులు పునరంకితం కావాలి’ అని బీసీ ఉద్యమకారులు పిలపునిచ్చారు. ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రాసిన ‘బహుజనగణమన’ దీర్ఘకావ్యాన్ని శనివారం ఏపీలోని విశాఖలోని జిల్లా కోర్టు ముందు మహాత్మా జ్యోతిబా ఫూలే, సర్దార్ గౌతు లచ్చన్న, ఆర్కే బీచ్‌లోని జాలాది విగ్రహాల ముందు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల ఆర్థిక, రాజకీయ, సామాజిక హకుల కోసం జరుగుతున్న పోరాటానికి అన్నివర్గాల్లోని ప్రగతిశీలవాదులు, కవులు, రచయితలు, సృజనశీలురు మద్దతు ప్రకటించాలని, బడుగుల పక్షాన నిలవాలని కోరారు. విశాఖపట్నం పలు ప్రగతిశీల ఉద్యమాలకు పురుడు పోసిందని, శ్రీశ్రీ షష్ఠి పూర్తి సందర్భంగా విశాఖ విద్యార్థులు ‘కవులారా మీరెటువైపు’ అని వేసిన కరపత్రం విప్లవ కవిత్వానికి బాటలు వేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
సరిగ్గా బీసీల ఉద్యమంగా రగులుకుంటున్న ఈ సందర్భంగా ‘అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ‘ప్రగతిశీలవాదులారా మీరెటువైపు’ అని బహుజన ఉద్యమం అడుగుతుందని చెప్పారు. ‘కవులారా మీరెటువైపు’ అని విశాఖ విద్యార్థులు వేసిన కరపత్రానికి శ్రీశ్రీ కదిలి రావడం నూతనశకానికి ఆరంభమైతే.. ఇప్పుడు విశాఖలో జూలూరు రాసిన ‘బహుజనగణమన’ కావ్యం బహుజన ఉద్యమానికి డిక్లరేషన్ లాంటిదని మాజీ వీసీ, యూపీఎస్సీ పూర్వసభ్యుడు కేఎస్ చలం అభిప్రాయపడ్డారు.
బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గోడి నరసింహాచారి, బీసీ స్టడీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, బీసీ నాయకుడు అప్పారావు, రచయిత్రి జాలాది విజయ, అరసం నేతలు ఉప్పల అప్పలరాజు, శ్యామసుందర్, స్ట్రగుల్ ఫర్ సోషల్ జస్టిస్ జిల్లా అధ్యక్షుడు సుబ్బారావుగౌడ్ తదితరులు సామూహికంగా ‘బహుజనగణమన’ కావ్యాన్ని ఆవిషరించారు.