సిటీ బ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): గణేష్ మహా నిమజ్జనానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిశాయి. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా గణనాథుల ప్రతిమలు భారీ ఎత్తున ఉస్సేన్ సాగర్‌కు చేరుకున్నాయి. రోజంతా దారులన్నీ ట్యాంక్‌బండ్ వైపే వెళ్లాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఖైరతాబాద్ మహా గణపతి ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకున్నాడు. బాహుబలి క్రేన్‌తో మహా గణపతిని నిమజ్జనం చేశారు. నిమజ్జనాన్ని వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా రావడంతో తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి నెక్లెస్ రోడ్ దాకా ఇసుకేస్తే రాలనంతగా మారిపోయింది.
మహా గణపతి నిమజ్జనం అనంతరం నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి విగ్రహాలు వేలాదిగా వచ్చాయి. రాత్రి ఏడు గంటలకు బాలాపూర్ నినాయకుడి నిమజ్జనం పూర్తయింది. అనంతరం రాత్రంతా నిమజ్జనాలు కొనసాగాయి. గణనాథుల నిమజ్జనానికి జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో పాటు ఆరు జోన్ల కమిషనర్లు, 30 సర్కిళ్ల పరిధిలోని డిప్యూటీ కమిషనర్లు, జీహెచ్ఎంఈసీ విభాగాల ఉన్నతాధికారులు నిమజ్జనం సజావుగా జరిగేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
రెవెన్యూ, విద్యుత్, హెచ్ఎండీఏ, జలమండలి, ట్రాఫిక్, ఆర్ అండ్ బీ, హైడ్రా, వైద్య ఆరోగ్య, పర్యాటక, సమాచార శాఖల అధికారులు నిధుల్లో పాల్గొన్నారు. రాత్రి 8 గంటల వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 2,54,685 విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. ఇందులో హుస్సేన్ సాగర్‌లో 10వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. మూడు షిప్టులలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది నిమజ్జనాలను నేడు కూడా కొనసాగించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 20 ప్రధాన చెరువులతో పాటు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనం కొనసాగుతున్నది. కృత్రిమ కొలనులను ఎక్కడిక్కడ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా భక్తులు నిమజ్జనాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 134 స్థిరంగా ఉండే క్రేన్లను ఏర్పాటు చేశారు. మరో 259 మొబైల్ క్రేన్ల సహాయంతో నిమజ్జనాలు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లు, డీఆర్ఎఫ్ టీమ్‌లతో పాటు 200 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. నగర వ్యాప్తంగా 13 కంట్రోల్ రూమ్‌ల ద్వారా పోలీసులు నిమజ్జనాలను పర్యవేక్షిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక శోభాయాత్ర 303 కిలోమీటర్ల మేర కొనసాగుతున్నది. ఊరేగింపులో కాగితపు ముక్కలను వెదజల్లకుండా వెళ్లాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. కాగితపు ముక్కలు, రంగులను వెదజల్లడం వల్ల పారిశుధ్య కార్మికులపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు.
ట్యాంక్ బండ్ పరిసరాలతో పాటు నగరంలోని ప్రధాన చెరువులకు వినాయక విగ్రహాలు, భక్తులు పోటెత్తారు. దీంతో జీహెచ్ఎంసీ 15 వేలమంది పారిశుధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచింది. వ్యర్థాలను సేకరించి జవహార్‌నగర్‌లోని ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలిస్తున్నారు. గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో భక్తులకు సౌలభ్యంగా ఉండేందుకు 39 మొబైల్ టాయిలెట్స్‌ను అందుబాటులో ఉంచారు.