ముంబై: ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనతో పాటు త్వరలో యూఏఈ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్‌నకు భారత జట్టులో చోటు కోల్పోయిన టీమ్ఇండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ జాతీయ జట్టులోకి వచ్చేందుకు బీసీసీఐ మరో అవకాశమిచ్చింది. ఈనెల ఆస్ట్రేలియా-ఏతో జరుగబోయే రెండు అనధికారిక టెస్టులకు శ్రేయాస్‌ను సారథిగా నియమించింది.
సెప్టెంబర్ 16-20, 23-27 తేదీల మధ్య జరిగే రెండు టెస్టులకు గాను శ్రేయాస్ భారత ‘ఏ’ జట్టును నడిపించనున్నాడు. సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణ, దేవ్‌దత్ పడిక్కల్, నితీశ్‌కుమార్ రెడ్డి వంటి యువ క్రికెటర్లు ఆసీస్‌తో ఆడనున్నారు. జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు శ్రేయాస్‌కు డిప్యూటీగా ఉండనున్నాడు. కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటారు.