PCB | దుబాయ్ : చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కు లు కలిగినప్పటికీ ఫైనల్‌ను తమ దేశంలో నిర్వహించుకోలేకపోయామనే బాధలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు మరో అవమానం ఎదురైంది. ఫైనల్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రెజెంటేషన్ సెర్మనీలో భాగంగా వేదికపై పీసీబీ నుంచి ఒక్క ప్రతినిధీ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై పీసీబీ.. ఐసీసీ తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. స్టేజీపై ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా, న్యూజిలాండ్ క్రికెట్ సీఈవో రోజర్ ట్వోజ్ ఉన్నారు. పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ పార్లమెంటు సమావేశాల కారణంగా దుబాయ్‌కు వెళ్లలేదు. కానీ పీసీబీ సీఈవో సుమైర్ అహ్మద్ సయ్యిద్తో పాటు పీసీబీ డైరెక్టర్ ఉస్మాన్ వహలా దుబాయ్‌లోనే ఉన్నప్పటికీ వారిని ఆహ్వానించలేదు. దీనిపై పాక్ మాజీ క్రికెటర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే ఐసీసీ, పీసీబీ సీఈవోకు సమాచార లోపం వల్ల ఇలా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఐసీసీ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘నఖ్వీ దుబాయ్‌కు రాలేదు. ఆతిథ్య దేశ బోర్డు తరఫున హెడ్ (అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, చైర్మన్, సీఈవో)ను మాత్రమే మేం అవార్డుల కార్యక్రమానికి పిలిచాం’ అని చెబుతున్నప్పటికీ అక్కడే ఉన్న సుమైర్, ఉస్మాన్‌ను ఎందుకు పిలవలేదనేది పీసీబీ వాదనగా ఉంది. భారత్ ట్రోఫీ గెలవడం వల్లే పాక్ ప్రతినిధులు వేదికపైకి రాలేదన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఇక పోడియంపై ప్రతినిధి లేకపోవడంతో పాటు భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో చాంపియన్స్ ట్రోఫీ లోగోను బ్రాడ్కాస్టర్లు మార్చడం.. ఆసీస్-ఇంగ్లండ్ మధ్య లీగ్ మ్యాచ్‌లో భారత జాతీయ గీతం వినిపించడంపై పీసీబీ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.