T20 World Cup 2024 : మరికొన్ని గంటల్లో టీ20 వరల్డ్ కప్ మొదలవ్వనుందనగా.. మాజీ చాంపియన్ భారత జట్టు(Team India) ఏకైక వామప్ మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే.. న్యూయార్క్ వేదికగా బంగ్లాదేశ్ (Bangladesh) తో జరిగే ఈ మ్యాచ్‌లో ఎవరు ఇన్నింగ్స్ ఆరంభిస్తారు? అనేది తెలియాల్సి ఉంది. ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు జోడీగా కుర్రాడు యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal)కు చాన్స్‌కు ఇవ్వాలా ? లేదా విరాట్ కోహ్లీ (Virat Kohli)ని పంపాలా? అనే విషయమై మేనేజ్మెంట్ తర్జనభర్జనలు పడుతోంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) ఓపెనింగ్ జోడీని తేల్చేశాడు.
హిట్‌మ్యాన్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించాలని దాదా అభిప్రాయ పడ్డాడు. అలాగని గంగూలీ ఏదో మాట వరుసకు ఈ కామెంట్ చేయలేదు. అతడి సూచన వెనక జట్టుకు మేలు చేయాలనే ఆలోచన ఉంది. రెవ్స్పోర్ట్జ్తో మాట్లాడిన గంగూలీ భారత ఓపెనింగ్ కాంబినేషన్‌పై విలువైన సలహా ఇచ్చాడు. ‘నేనైతే రోహిత్, కోహ్లీలను ఓపెనర్లుగా పంపిస్తా అని ఈ మాజీ సారథి చెప్పాడు. ఐపీఎల్(IPL 2024)లో కోహ్లీ ఎలా చెలరేగాడో చూశాం. పదిహేడో సీజన్ రెండో భాగంలో ఆర్సీబీ(RCB) ఓపెనర్‌గా విరాట్ దంచాడు.

అతడు ఎంతో స్వేఛ్చగా ఆడాడు. కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో మళ్లీ వక్కాణించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ కప్‌లో టీమిండియా అదరగొట్టాలంటే ఐపీఎల్లో ఆడినట్టే విరాట్ స్వేచ్ఛగా ఆడాలి. అందుకని టాపార్డర్‌లో అనుభవజ్ఞులైన రోహిత్, కోహ్లీలు ఆడడం ఎంతో ముఖ్యం’ అని గంగూలీ వెల్లడించాడు. ఐపీఎల్లో రోహిత్ ముంబై ఓపెనర్‌గా, కోహ్లీ బెంగళూరు ఓపెనర్‌గా శుభారంభాలు ఇచ్చారు. ఈ ఇద్దరూ టీమిండియా తరఫున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే.. ఓపెనర్లుగా హిట్ కొడతారా? అనేది చెప్పలేం.
రోహిత్, యశస్వీ, కోహ్లీ

ఇక యశస్వీ విషయానికొస్తే.. శుభ్‌మన్ గిల్(Shubman Gill) గైర్వాజరీలో టెస్టు, టీ20 ఓపెనర్‌గా పరుగుల వరద పారించాడు. వెస్టిండీస్ పర్యటన, స్వదేశంలో ఇంగ్లండ్(England)తో జరిగిన టెస్టు సిరీస్‌లో యశస్వీ.. రోహిత్‌కు జోడీగా ఇన్నింగ్స్ ఆరంభించి ఆకట్టుకున్నాడు. దాంతో, వీళ్లనే ఓపెనర్లుగా పంపి.. మూడో స్థానంలో కోహ్లీని ఆడించాలని మాజీలు సూచిస్తున్నారు.

ఒకవేళ ఓపెనర్లు విఫలమైనా.. విరాట్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకుంటాడని, అందుకని అతడిని మూడో స్థానంలో ఆడిస్తే జట్టుకు మంచిదని వాళ్ల అభిప్రాయం. అప్పుడు ఐపీఎల్లో దంచికొట్టిన సంజూ శాంసన్(Sanju Samson)ను ఏ స్థానంలో ఆడించాలి? అనేది మరో ప్రశ్న. ఐర్లాండ్‌తో జూన్ 5న జరిగే తొలి మ్యాచ్ సమయానికి జట్టుకు కూర్పు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌లకు పెద్ద సవాలే.